అనూహ్య హత్య కేసు: చంద్రభాన్ దోషిగా నిర్ధారణ | Sakshi
Sakshi News home page

అనూహ్య హత్య కేసు: చంద్రభాన్ దోషిగా నిర్ధారణ

Published Tue, Oct 27 2015 1:19 PM

అనూహ్య హత్య కేసు: చంద్రభాన్ దోషిగా నిర్ధారణ - Sakshi

మచిలీపట్నం నుంచి వెళ్తూ.. ముంబైలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో నిందితుడు చంద్రభాన్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అతడికి శిక్షను బుధవారం ఖరారు చేస్తారు. ముంబైలో టీసీఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసే అనూహ్య.. తన తల్లిదండ్రులతో కలిసి క్రిస్మస్ జరుపుకోడానికి తమ సొంతూరు కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చింది. తిరిగి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అదృశ్యమైంది. ఎల్‌టీటీ స్టేషన్‌లో రైలు దిగిన ఆమెకు టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెపై అత్యాచారం చేసి హతమార్చాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ కేసు విచారణ సాగుతోంది.  1300 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. చివరకు నిందితుడు చంద్రభాన్‌ను దోషిగా నిర్ధారించారు. రేపు శిక్ష ఖరారు చేస్తారు. అతడికి యావజ్జీవ శిక్ష లేదా ఉరిశిక్ష విధించే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. చంద్రభాన్..  అత్యాచారం, హత్య చేసినట్లుగా కోర్టు తేల్చింది

అనూహ్య నుంచి దొంగిలించిన బ్యాగ్, దుస్తులు, ఐడీ కార్డు తదితరుల వస్తువుల ఆచూకీని పోలీసులు గుర్తించగలిగారు. వాటిలో లభించిన డీఎన్‌ఏ నమూనాల ద్వారా నిందితుడు చంద్రభాన్ అని నిర్ధారించారు. సొంతూరు మచిలీపట్నం నుంచి 2014 జనవరి ఐదున ముంబైకి వచ్చిన అనూహ్య అదృశ్యం కావడంతో కేసు నమోదైంది. కుళ్లిపోయిన ఈమె మృతదేహం అదే నెల16వ తేదీన భాండుప్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో దొరికింది.

Advertisement
Advertisement