పొట్టిశ్రీరాములును విస్మరించడం బాధాకరం | Sakshi
Sakshi News home page

పొట్టిశ్రీరాములును విస్మరించడం బాధాకరం

Published Tue, Nov 1 2016 11:16 PM

మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు

రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న టీడీపీ
వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన
 
శ్రీకాకుళం అర్బన్‌: తెలుగు భాష మాట్లాడే వారందరి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేసి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సాధించారని, అటువంటి అమరజీవిని తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాధరావు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాకుళంలోని పాత బస్టాండ్‌ వద్దనున్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అనాలోచితంగా, బాధ్యతా రాహిత్యంగా పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడడం దుర్మార్గపు చర్య అన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం పేదల పొట్టలు కొడుతూ ధనవంతులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయిన రోజు జూన్‌ 2వ తేదీ అని, ఆ రోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అవతరన దినోత్సవంగా చెప్పుకోవడం శోచనీయమన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శమని ధర్మాన అన్నారు. జూన్‌ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా అవుతుందో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నవంబరు ఒకటో తేదీని సప్రదాయంగా కొనసాగించకపోవడం టీడీపీ దుర్మార్గానికి నిదర్శనమన్నారు. 
 
ప్రభుత్వ భూముల దోపిడీకే క్యాబినెట్‌ సమావేశాలు
 
క్యాబినెట్‌ సమావేశాల్లో కేవలం ప్రభుత్వ భూములు ఎలా అమ్మాలి, ప్రజల ఆస్తులు ఎలా దోచుకోవాలి తదితర ఆలోచనలే తప్ప ప్రజాసమస్యలపై కనీస శ్రద్ధ చూపకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ఇంత దుర్మార్గంగా ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదీ లేదన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పాటుపడుతోందని ధర్మాన చెప్పారు.
 
టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను ఎండగట్టేందుకు ప్రజలంతా సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, గొండు కృష్ణమూర్తి, డాక్టర్‌ పైడి మహేశ్వరరావు, చల్లా అలివేలు మంగ, సాధు వైకుంఠరావు, డాక్టర్‌ శ్రీనివాస్‌ పట్నాయక్, మండవిల్లి రవి, గుమ్మా నగేష్, టి.కామేశ్వరి, ఎం.ఎ.రఫి, ఎం.వి.స్వరూప్, శిర్ల రామారావు, అంబటి శ్రీనివాసరావు, కె.సీజు, గుడ్ల మల్లేశ్వరరావు, పొన్నాడ రుషి, కోరాడ రమేష్, గుడ్ల దామోదరరావు, పసగడ రామకృష్ణ, రావాడ జోగినాయుడు, ధర్మాన రఘునాధమూర్తి, పీస శ్రీహరి, బైరి మురళి, జె.ఎం.శ్రీనివాస్, తెలుగు సూర్యనారాయణ పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement
Advertisement