కార్యకర్తలకు ముఖం చూపలేం | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు ముఖం చూపలేం

Published Tue, May 24 2016 10:51 AM

కార్యకర్తలకు ముఖం చూపలేం - Sakshi

రెండేళ్లు గడిచినా న్యాయం చేయలేని పరిస్థితి
టీడీపీ జిల్లా మహానాడులో నాయకుల ఆవేదన
సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన మాజీ మంత్రి టీజీ
శ్రీశెలం, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేల గైర్హాజరు
 
 

కర్నూలు: పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు. నియోజకవర్గాల పర్యటనకు వెళ్లినప్పుడు పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక ముఖం చాటేయాల్సి వస్తోంది. ఈ విషయంపై ఇన్‌చార్జి మంత్రి దృష్టి సారించాలి.’ అని మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కె.ఇ.ప్రభాకర్, ఎన్.ఎం.డి.ఫరూక్, శిల్పామోహన్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బి.సి.జనార్ధన్‌రెడ్డి, మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అధ్యక్షతన స్థానిక వీజేఆర్ కన్వెన్షన్ హాల్‌లో టీడీపీ జిల్లా మహానాడు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త, పాత నాయకులు విభేదాలు పక్కనపెట్టి సమష్టిగా పని చేయాలన్నారు. వర్గాలను కాపాడుకునేందుకు బహిరంగంగా తగాదాలకు దిగితే పార్టీకి నష్టం తప్పదన్నారు. పునర్విభజనలో భాగంగా నాయకులందరికీ రాజకీయ అవకాశాలు ఉంటాయన్నారు.

అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు మీనాక్షినాయుడు, కె.ఈ.ప్రతాప్, వీరభద్ర గౌడ్, విష్ణువర్దన్‌రెడ్డి, బి.టి.నాయుడు, పార్టీ పరిశీలకుడు సాంబ శివరావు తదితరులు ప్రసంగించారు. శ్రీశైలం, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, బి.వి.జయనాగేశ్వరరెడ్డి, ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితరులు మహానాడుకు గైర్హాజరయ్యారు. మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ తన ప్రసంగం ముగియగానే సభ నుంచి నిష్ర్కమించారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు కాసాని గోవర్ధన్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, శివానందరెడ్డి, గడ్డం రామకృష్ణ, బత్తిన వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులో చర్చించి జిల్లా మహానాడుకు పంపిన తీర్మాణాలను సభలో చర్చించి ఆమోదించారు.

Advertisement
Advertisement