Sakshi News home page

పచ్చ నేతల బరితెగింపు

Published Wed, Aug 10 2016 12:41 AM

పచ్చ నేతల బరితెగింపు

బద్వేలు అర్బన్‌: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అధికారమే ఆయుధంగా పచ్చనేతలు బరితెగిస్తున్నారు. ఏళ్ల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను సైతం గుట్టుచప్పుడు కాకుండా పట్టాలు చేయించుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతుపై దౌర్జన్యానికి దిగడంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

బద్వేలు మండల పరిధిలోని కొంగళవీడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొంగళవీడు గ్రామంలోని  సర్వేనంబరు 54/2, 56/2 లలో ఉన్న సుమారు 10 ఎకరాల  ప్రభుత్వ బంజరు భూమిని సుమారు 40 సంవత్సరాలుగా  గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగుచేసుకుంటున్నారు. ఈ భూములపై పట్టాలు ఇవ్వాలని గతంలో అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేకపోవడంతో అలాగే సాగుచేసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా  గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు సర్పంచ్‌గా తమ అభ్యర్థిని గెలిపిస్తే సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు చేయిస్తామని నమ్మబలికి  ఓట్లు వేయించుకుని గెలుపొందారు. ఆ తర్వాత కూడా రైతులు అనేక సార్లు పట్టాల విషయం ప్రస్తావించినప్పటికీ త్వరలోనే మంజూరవుతాయి అంటూ కాలం వెళ్లబుచ్చుతుండేవారు.

ఈ క్రమంలో తమకు సంబంధిత భూములలో పాత పట్టాలు ఉన్నాయంటూ  అధికార పార్టీ నేతలు సాకు చూపి అప్పటి రెవెన్యూ అధికారులను లోబరుచుకుని గుట్టుచప్పుడు కాకుండా తమ బంధువుల పేరుమీద  పట్టాలు చేయించుకున్నారు. అయితే గత వారం రోజుల క్రితం ఆన్‌లైన్లో కూడా తమ పేర్లు నమోదు చేసుకున్నారని  రైతులకు తెలియడంతో వారిని గట్టిగా నిలదీశారు.  అయినప్పటికీ లెక్కచేయకుండా సాగులో ఉన్న భూములలో సర్వేయర్‌తో కొలతలు వేయించేందుకు రంగంసిద్ధం చేసుకుని మంగళవారం  పొలాల వద్దకు తమ అనుచరులతో వచ్చారు. ఈ సమయంలో రైతులకు, అధికార పార్టీ నాయకులకు మధ్య  తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో  కొలతలు వేసేందుకు వచ్చిన సర్వేయర్‌ వెనుతిరిగారు.

దీంతో కోపోద్రిక్తులైన అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న రైతులలో ఒకరైన కొత్తపు శ్రీనివాసులరెడ్డి (50) పై  దౌర్జన్యం చేసి దుర్భాషలాడారు.  దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసుల రెడ్డి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  వెంటనే స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాగే గ్రామానికి చెందిన కాకర్ల పాలక్కగారి చెన్నకేశవరెడ్డి సర్వే నంబరు 56/2లో సాగుచేసుకుంటున్న భూమిపై కూడా అధికార పార్టీ నాయకులు పట్టాలు పొందారని గ్రామస్తులు తెలిపారు. రైతు ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి రైతుతో మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement