విత్తన పంపిణీలోనూ.. అధికార పెత్తనం | Sakshi
Sakshi News home page

విత్తన పంపిణీలోనూ.. అధికార పెత్తనం

Published Sun, May 14 2017 11:21 PM

విత్తన పంపిణీలోనూ.. అధికార పెత్తనం - Sakshi

– పంపిణీ బాధ్యతల కోసం జోరుగా పైరవీలు
– పలు మండలాల్లో ‘తముళ్ల’ మధ్యనే పోటీ


అనంతపురం అగ్రికల్చర్‌ : విత్తన వేరుశనగ పంపిణీలోనూ రాజకీయ పెత్తనం ఎక్కువవుతోంది. బయోమెట్రిక్‌ పద్ధతిలో విత్తన పంపిణీ కోసం ఓ వైపు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పంపిణీ బాధ్యతలు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పైరవీలు చేస్తున్నారు. ఈసారి నాలుగు బస్తాలు ఇవ్వనున్నట్లు ఇటీవల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విత్తన కేటాయింపులు 3.50 లక్షల నుంచి 4.01 లక్షల క్వింటాళ్లకు పెరిగాయి. ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్‌తో పాటు వాసన్‌ అనే ఎన్‌జీవో ద్వారా విత్తనకాయ సేకరిస్తున్నారు. ఇప్పటికే 3.20 లక్షల క్వింటాళ్లు వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టాక్‌ పాయింట్లకు చేర్చారు. ప్రభుత్వం నుంచి విత్తన ధరలు, రాయితీలు ఖరారు కాగానే పంపిణీ తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.

ఎలాగైనా ఈనెలాఖరు నాటికి మొదటి విడత పంపిణీ పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా... మండలాల్లో పంపిణీ చేసే బాధ్యతలు తమకే ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒక క్వింటాపై రూ.50 కమిషన్‌ ఉండటంతో ఎక్కువ కేటాయింపులు కలిగిన మండలాలు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వ్యవసాయశాఖ, సేకరణ సంస్థల అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నారు. 10 వేల క్వింటాళ్లు కలిగిన మండలాల్లో వంద శాతం పంపిణీ జరిగితే రూ.5 లక్షల వరకు కమిషన్‌ వస్తుంది. అందులో అన్ని రకాల ఖర్చులు సగం పోయినా సగమైనా మిగులుతుంది. ఖర్చులు తగ్గించుకుంటే 70 శాతం వరకు కమిషన్‌ రూపంలో మిగులుతుందనే ఆలోచనతో పైరవీలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలదే హవా
గతంలో చాలా వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌), రైతు సేవా కేంద్రాలు (ఆగ్రోస్‌) ఎక్కువగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వాటిని చాలా వరకు పక్కన పెట్టేశారు. అంతో ఇంతో కమీషన్‌ వస్తుందనే ఆశతో తెలుగు తమ్ముళ్లు రంగంలో దిగడంతో నువ్వా...నేనా...? అన్నట్లు వారి మధ్యనే చాలా చోట్ల పోటీ ఏర్పడింది. పంపిణీ చేయడానికి వీలుగా ఎలాంటి అనుభవం లేకున్నా ఇప్పటికిపుడు సీడ్‌ లైసెన్స్‌ పొందేందుకు ఎగబడుతున్నారు.

తమ వారికి అవకాశం కల్పించాలంటూ కీలక నేతలు సిఫారసు చేస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులు, ఏజెన్సీలకు చెందిన అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది పంపిణీ చేసిన విత్తన వేరుశనగకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము దాదాపు రూ.1 కోటి వరకు తమ్ముళ్లు కట్టకుండా దర్జాగా తిరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చోటామోటా నేతలు పంపిణీ బాధ్యతలు దక్కించుకునే యత్నాల్లో ఉన్నాయి. ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలదే సర్వాధికారంగా సాగుతున్నట్లు సమాచారం. వారు చెప్పిందే వేదంగా అధికార యంత్రాంగం కూడా ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement