గృహకల్పపై ‘తమ్ముళ్ల’ కన్ను! | Sakshi
Sakshi News home page

గృహకల్పపై ‘తమ్ముళ్ల’ కన్ను!

Published Wed, Jun 29 2016 1:05 AM

TDP leaders focus on Rajiv grhakalpa flats

నరసరావుపేట : రాజీవ్ గృహకల్ప సముదాయంపై టీడీపీ నేతల కన్ను పడింది. అక్కడ నివాసం ఉండని లబ్ధిదారుల ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా మంగళవారం హౌసింగ్ డీఈ పర్యవేక్షణలో డివిజన్ పరిధిలోని ఆరుగురు అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రతి ప్లాటు వద్దకు వెళ్లి వివరాలను సేకరించారు. ఈ సర్వేలో సుమారు 102 ప్లాట్ల యజమానులు చేరకుండా ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

నెల రోజులుగా టీడీపీలో జిల్లా స్థాయి పదవి ఉన్న నరసరావుపేట నాయకుడు ఒకరు గృహకల్ప చుట్టూ తిరిగి హౌసింగ్ అధికారులతో మిలాఖిత్ అయి ఓ ప్రణాళిక రూపొందించారు. దానికి స్థానిక ముఖ్య నేత తనయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఖాళీ ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగి సర్వే పేరుతో హడావిడి చేశారు. ఒక్కో ప్లాట్‌కు రూ.50 వేల వరకు తీసుకొని తమ అనుయాయులకు వాటిని అప్పజెప్పే పనిని జిల్లాస్థాయి టీడీపీ నాయకుడు తన భుజాలపై వేసుకున్నాడనేప్రచారం జోరుగా సాగుతోంది.
 
మౌలిక సదుపాయాలు లేకే ప్లాట్లు ఖాళీ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేదల కోసం రాజీవ్ గృహకల్పకు రూపకల్పన చేశారు. 2005లో నరసరావుపేట నగరబాట సందర్భంగా ఆయన పెద్ద చెరువులో 384 ఇళ్ల రాజీవ్ గృహకల్ప సముదాయానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 16 బ్లాకులుగా ఒక్కోదానిలో 24 చొప్పున 394 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. 15 బ్లాకుల్లో 360 ప్లాట్ల నిర్మాణం పూర్తయింది.

వీటిని 2013లో లబ్ధిదారులకు కేటాయించారు. అయితే రోడ్లు, తాగు నీరు, చుట్టూ ప్రహరీ తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొందరు ఇక్కడ నివాసం ఉండటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని లబ్ధిదారులు నివాసం ఉండటం లేదనే సాకుతో ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు ‘సర్వే’ అస్త్రాన్ని ప్రయోగించారు.
 
అధికారులపై ఆగ్రహం..
సర్వే విషయం తెలుసుకున్న యజమానులు గృహకల్పకు చేరుకున్నారు. ఎందుకు వివరాలు సేకరిస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని నిలదీశారు. దీంతో అధికారులు ఖంగు తిన్నారు. ఎవరెవరు ఏయే ప్లాట్లలో నివాసం ఉంటున్నారో తెలుసుకునేందుకు మాత్రమే సర్వే నిర్వహిస్తున్నామని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. 2011లో జారీ చేసిన జీవో ప్రకారం సర్వే చేస్తున్నామని చెప్పి తతంగాన్ని పూర్తి చేసుకుని వెళ్లారు.
 
అనుయాయులకు అమ్ముకునేందుకే..
ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప సముదాయ కమిటీ చైర్మన్ సబ్బితి సుధాకర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకొని వారి అనుయాయులకు అమ్ముకునేందుకే అధికారులతో ఈ సర్వే చేయిస్తున్నారని ఆరోపించారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నోసార్లు వేడుకున్నా అధికారులు స్పందించలేదని చెప్పారు. ఇప్పుడు నివాసం ఉండటం లేదనే నెపంతో ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement