శివాజీకి అవకాశం వచ్చేనా..?

15 Feb, 2017 22:19 IST|Sakshi
శివాజీకి అవకాశం వచ్చేనా..?

ముందస్తు తర్ఫీదులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టడానికి రంగం సిద్ధమవుతోంది! రేపో మాపో రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రి పదవి కోసం ఎవ్వరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంటూ జరిగితే జిల్లా నుంచి కళా వెంకటరావుకు కచ్చితంగా చోటు లభిస్తుందనే ఊహాగానాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇక సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక సామాజికవర్గం కోటాలో కూన రవికుమార్, మహిళా కోటాలో గుండ లక్ష్మీదేవి కూడా  తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర సమీకరణాలతో సిక్కోలు జిల్లా రాజకీయాలతో ముడిపడి ఉండటంతో మంత్రి అచ్చెన్నాయుడికి మార్పు తప్పదనే వాదనలు ఉన్నాయి.

సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌తో పాటు టీడీపీలోకి ఫిరాయించిన నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టాలంటే ప్రస్తుతం ఉన్న మంత్రిమండలిలో మార్పులు చేర్పులు తప్పని పరిస్థితి. మంత్రివర్గ కూర్పులో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రధానంగా సామాజికవర్గాల కోటానే కీలకం. ప్రస్తుత మంత్రి మండలిలో జిల్లా నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి సిక్కోలుకే చెందిన కిమిడి మృణాళిని, విశాఖ జిల్లా నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందంటూ రెండేళ్లుగా చంద్రబాబు ఊరిస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళావెంకటరావుకు ఎప్పటికైనా బెర్త్‌ లభిస్తుందని ఆయన అనుచరగణమంతా ఆశలు పెంచుకున్నారు. అయితే కళావెంకటరావు గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి సొంతగూటి చేరడమే మైనస్‌ కావడంతో ఆయన కుటుంబానికే చెందిన మృణాళినికి మంత్రి పదవి లభించింది. ఇప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాకే చెందిన బొబ్బిలి ఫిరాయింపు ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావుకు బెర్త్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బొబ్బిలి రాజుకు చోటు ఇస్తే...
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి ఫిరాయించి వచ్చిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చోటు కల్పించడంపై అప్పట్లో పచ్చపార్టీ శ్రేణులన్నీ అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. చివరకు ప్రమాణం స్వీకారం చేయించి గవర్నరు కూడా తప్పు చేశారన్నట్లుగా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు అదే గవర్నరు చంద్రబాబు ప్రభుత్వంలో చేరాలనుకొని పార్టీ ఫిరాయించిన నాయకులతో మంత్రిగా ప్రమాణం చేయించాల్సిన పరిస్థితి. వాటన్నింటినీ పక్కనబెట్టేసి బొబ్బిలి రాజు సుజయ్‌కు మంత్రి పదవి కట్టబెడితే ఉత్తరాంధ్రలో సమీకరణాలు మారిపోనున్నాయి. ఆయన వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందినప్పటికీ కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడులను అదే కోటాలో లెక్క గట్టేస్తున్నట్లు వినికిడి. అంటే ఉత్తరాంధ్రలో ఒకే సామాజికవర్గం నుంచి ముగ్గురు మంత్రి మండలిలో ఉంటారు. దీన్ని ఇద్దరికి పరిమితం చేయాలంటే అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఇద్దరిలో ఒకరికి పదవీత్యాగం తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అచ్చెన్నకు పదవీగండం...
టీడీపీలో కింజరాపు ఎర్రన్నాయుడికి ఉన్న పలుకుబడి, ఆయన అకాల మరణం నేపథ్యంలో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి లభించింది. ఇందుకోసం చంద్రబాబు జిల్లాలో సీనియర్‌ నాయకులైన గౌతు శివాజీ, కళావెంకటరావులను పక్కనబెట్టేశారు. అప్పటి నుంచి వారి మధ్య సయోధ్య లేదని, గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పునర్‌వ్యవస్థీకరణ అంటూ జరిగితే తమకు కేబినెట్‌లో బెర్త్‌ లభిస్తుందని శివాజీ, కళావెంకటరావు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. ఇటీవల వంశధార నిర్వాసితుల పరిహారం విషయంలో అచ్చెన్నాయుడు చంద్రబాబు ఆగ్రహానికి గురవ్వడం, జిల్లాలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం తదితర కారణాలతో ఆయనకు పదవీగండం తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో సుజయ్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటే మృణాళిని తప్పించాల్సి ఉందని, ఆమె స్థానంలో కళా వెంకటరావుకు చోటు కల్పిస్తారనే వాదన ఉంది. అలా సుజయ్, కళావెంకటరావులకు చోటు లభిస్తే అచ్చెన్నాయుడికి పదవీ గండం తప్పదు. ఉత్తరాంధ్రలో సామాజిక కోణంలోనే సమీకరణాలు ఉంటే గంటా శ్రీనివాసరావుతో సరిపడని చింతకాయల అయ్యన్నపాత్రుడినే చంద్రబాబు తప్పిస్తారని, అచ్చెన్నాయుడి పదవికి ఇబ్బంది ఉండబోదనే ధీమా అచ్చెన్న అనుచరుల్లో కనిపిస్తోంది.

ఊహల పల్లకిలో..!
జిల్లాలో మరో సీనియర్‌ నాయకుడైన శివాజీ కూడా ఎప్పటి నుంచో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. లోకేష్‌తో సామాజిక కోణంలో సంబంధాలు నెరపుతున్న శివాజీ అల్లుడు ఆ దిశగా మార్గం సుగమం చేసేందుకు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్న శివాజీ అల్లుడి ప్రయత్నాలు ఎంతవరకూ నెరవేరుతాయో చూడాల్సిందే. మరోవైపు కాళింగ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మృణాళినిని తప్పిస్తే ఉత్తరాంధ్ర నుంచి మహిళా కోటాలో మంత్రి పదవి కోసం మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి కూడా ఆశిస్తున్నట్లు వినికిడి. చివరకు ఎవ్వరికి బెర్త్‌ లభిస్తుందో, ఎవ్వరికి పదవీ త్యాగం తప్పదో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందని టీడీపీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు