ఓట్లు కొల్లగొట్టి బలిపశువు చేస్తారా? | Sakshi
Sakshi News home page

ఓట్లు కొల్లగొట్టి బలిపశువు చేస్తారా?

Published Tue, Mar 15 2016 12:50 AM

ఓట్లు కొల్లగొట్టి బలిపశువు చేస్తారా? - Sakshi

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం  : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేత పి.వి.రమణను స్థానిక ఎమ్మెల్యే సహా ఆమె ఆనుచరులు బహిష్కరణ వేటుకు తీర్మానించిన విషయం అదే పార్టీలో రెండోరోజూ చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీ నేతలు కొంతమంది ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షురాలు శిరీష దృష్టికి సోమవారం తీసుకువెళ్లినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కళింగవైశ్యులు రమణ విషయంలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీకి 30యేళ్లపాటు సేవలందించిన రమణను స్థానిక ఎమ్మెల్యే టార్గెట్ చేశారని, ఉన్న పదవుల్ని తీయించి, కొత్త పదవులు రానీయకుండా చేశారంటూ నిందిస్తున్నారు.
 
 ఇందులో భాగంగానే జిల్లా మంత్రి ఊళ్లో లేని సమయంలో ఆయనకు తెలియకుండా రమణను పార్టీ నుంచి బహిష్కరించాలని తీసుకున్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో కళింగ వైశ్యుల్ని బీసీలో చేరుస్తామంటూ ప్రకటనలు గుప్పించి, వారి ఓట్లను కొల్లగొట్టి ఇప్పుడు అదే కులానికి చెందిన రమణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇదే విషయమై పార్టీ పెద్దల వద్ద తాడోపేడో తేల్చుకుంటామని రమణ వర్గీయులు చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడితే భవిష్యత్తులో ఇబ్బందులుంటాయనే భావనతో ఈ విషయం బయటకు చెప్పలేకపోతున్నా రమణను పార్టీలో కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని శపథం చేసినట్టు తెలిసింది.
 
 వివరణ తీసుకోరా?
 పార్టీకి సేవలందిస్తున్న కార్యకర్త తప్పుచేశారని భావిస్తే కనీసం వివరణ తీసుకునే ప్రయత్నం చేయరా? అంటూ రమణ వర్గీయులు ఎమ్మెల్యే చర్యల్ని తప్పుబడుతున్నారు. నియోజకవర్గ సమావేశానికి రమణను రానీయకుండా చేసి, జిల్లా అధ్యక్షురాలి అనుమతి తీసుకోకుండానే బహిష్కరణ అంశాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని ఆక్షేపిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అధిష్టానం ద్వారా చెప్పించడమో, సమన్వయకమిటీ సమావేశంలో చర్చించడమో చేయకుండా ఏకపక్షంగా బలిచేసే ప్రయత్నాన్ని కళింగ వైశ్యులు అంగీకరించడం లేదు. ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదులొస్తే ఒక్కరినే సస్పెండ్ చేయాలని చూడడం, తన వర్గీయుల్ని ఎమ్మెల్యే కాపాడుకుందామని ప్రయత్నిండంపై కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారని కళింగవైశ్య కులస్తులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్‌కు నిధుల ప్రకటించిన విషయాన్ని మంత్రి పేరు కాకుండా సీఎం, మునిసిపల్ మంత్రి పేర్లు ఎమ్మెల్యే ప్రస్తావించడాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
 
 హాజరుపట్టీ సంతకాలతోనా?
 ఎమ్మెల్యే ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షలో కొంతమంది పార్టీ పెద్దలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ మేరకు అందరి వద్దా ఎమ్మెల్యేలు సంతకాలు తీసుకున్నారని, అవే సంతకాలు చూపించి రమణపై బహిష్కరణ వేటు వేయాలని అంతా తీర్మానించారని ఎమ్మెల్యే వర్గీయులు మిగతా నాయకులకు చెప్పడాన్ని కూడా ఖండిస్తున్నారు. హాజరుపట్టీ సంతకాల్నే తీర్మాన సంతకాలుగా ఎలా గుర్తిస్తారని, పార్టీ జిల్లా అధ్యక్షురాల్ని కూడా ఇదే విషయమై ప్రశ్నిస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తామంటున్నారు. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పేలా లేదని, రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న వైఎస్సార్‌సీపీయే మేయర్ పీఠాన్ని కొల్లగొడుతుందని టీడీపీలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలో ఆవరించిన భయాన్ని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.
 

Advertisement
Advertisement