తెలుగుదేశం కడుపు మంట | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం కడుపు మంట

Published Tue, Jul 12 2016 1:21 AM

తెలుగుదేశం కడుపు మంట - Sakshi

- హోదా మరచి ప్రవర్తించిన ఎమ్మెల్యే
- గుమ్మాలకు ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మలు
- ప్రతిఘటించిన వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్
 
 పాతపోస్టాఫీసు (విశాఖ) : వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘గడపగడపకూ వైఎస్సార్’ కార్యక్రమానికి లభిస్తున్న ప్రజా స్పందనను చూసి తెలుగుదేశం తట్టుకోలేకపోతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ హోదాను మరచి ప్రవర్తించారు. సోమవారం ప్రతిపక్ష నేతను కించపరిచే విధంగా జగదాంబ సెంటర్‌లో గుమ్మాలు ఏర్పాటు చేసి, వాటికి వై.ఎస్.జగన్ మాస్కులతో దిష్టిబొమ్మలను వేలాడదీశారు. విషయం తెలుసుకున్న దక్షిణ నియోజకవ ర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మైనారిటీ నగర విభాగం అధ్యక్షుడు షరీఫ్ కార్యకర్తలతో జగదాంబ కూడలికి చేరుకున్నారు.

టీడీపీ తీరుకు నిరసనగా సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఎమ్మెల్యే ప్రోద్భలంతో పోలీసులు దిష్టిబొమ్మను దహనం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసి మహారాణిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరగంట తరువాత ఎమ్మెల్యేను పోలీసు జీపు ఎక్కించేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జీపుకు అడ్డంగా పడుకోవడంతోపాటు జీపుపైకి ఎక్కారు. ఈ సందర్భంగా పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. అయినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి సంశయించారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేను మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించిన అరగంటలోపే విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను మాత్రం  అధికారులు సమావేశంలో ఉన్నారంటూ తాత్సారం చేసి రాత్రి 8.15 గంటలకు విడుదల చేశారు.

Advertisement
Advertisement