కన్నీటి ‘కెరటం’ | Sakshi
Sakshi News home page

కన్నీటి ‘కెరటం’

Published Thu, Oct 6 2016 1:35 AM

కన్నీటి ‘కెరటం’ - Sakshi

 మొగల్తూరు/భీమవరం అర్బన్‌ : పుట్టిన రోజు వేడుకను స్నేహితులతో కలిసి ఆనందంగా బీచ్‌లో జరుపుకుందామని వెళ్లిన ఆ విద్యార్థి కుటుంబాన్ని విషాద కెరటం ముంచెత్తింది. ముగ్గురు స్నేహితులను కడలి కబళించింది. మూడు కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. చేతికి అందివచ్చిన కొడుకులను మృత్యు అల బలి తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 
 
భీమవరం మండలం గూట్లపాడుకు చెందిన కారుమూరి సాయితేజ (22), కృష్ణాజిల్లా కలిదిండికి చెందిన మంతెన భాను ప్రకాష్‌ (22) భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. గూట్లపాడుకు చెందిన మరో విద్యార్థి రేవు రాజేష్‌ (17) అదే కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరు ముగ్గురూ స్నేహితులు. వీరు ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయి తేజ పుట్టిన రోజు కావడంతో పేరుపాలెం బీచ్‌లో వేడుకలు జరుపుకోవాలని తలంచారు. దీంతో సాయితేజ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆటోలో బీచ్‌కు వచ్చాడు. అతని స్నేహితులు సుమారు 15 మంది మోటార్‌సైకిళ్లపై బీచ్‌కు వచ్చారు. మధ్యాహ్నం వీరంతా కలిసి సముద్రస్నానం చేశారు. ఆ తర్వాత సేదదీరారు. అనంతరం సాయితేజ, రాజేష్, భానుప్రకాష్‌ తిరిగి స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో అలల ఉధృతికి కొట్టుకుపోయారు. ఆ తర్వాత వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. వీరి మృతదేహాలను రోడ్డు వరకూ ఆటోలో, ఆతర్వాత 108లో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
పుట్టినరోజు నాడే 
సాయితేజ తండ్రి సూర్యనారాయణ కిరాణా వ్యాపారం చేస్తుంటారు. ఎనిమిదేళ్ల క్రితం ఆయన కుటుంబంతో సహా గూట్లపాడుకు వలస వచ్చారు. సాయితేజాకు తల్లి శ్రావణి, చెల్లెలు ఉన్నారు. బుధవారం అతని పుట్టినరోజు కావడంతో పేరుపాలెం బీచ్‌లో వేడుక చేయాలని తల్లిదండ్రులు తలంచారు. కొడుకును కెరటాలు బలితీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
స్నేహితుని పుట్టినరోజుకెళ్లి : రేవు రాజేష్‌ తండ్రి  ఏడుకొండలు కూలిపనులు చేస్తూ.. ఇంటిని గడుపుతున్నాడు. కష్టపడి కొడుకును ఇంటర్మీడియెట్‌ చదివిస్తున్నాడు. రాజేష్‌కు తల్లి మావుళ్లమ్మ, చెల్లెలు ఉన్నారు. రాజేష్‌ స్నేహితుడు సాయితేజ పుట్టిన రోజు వేడుకలకని బీచ్‌కు వెళ్లి విగతజీవిగా మారాడు. దీంతో అతని తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. కొడుకు మరణ వార్త విన్న రాజేష్‌ తల్లి మావుళ్లమ్మ స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను వెనువెంటనే బంధువులు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.  
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement