10 నెలల్లో పది ఇళ్లు కట్టలేదు | Sakshi
Sakshi News home page

10 నెలల్లో పది ఇళ్లు కట్టలేదు

Published Wed, Aug 24 2016 12:28 AM

10 నెలల్లో పది ఇళ్లు కట్టలేదు - Sakshi

  • హామీల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం
  • టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క
  • వరంగల్‌ :  తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం పథకం కింద జి ల్లాలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క విమర్శించారు. హన్మకొండ బాలసముద్రంలోని శ్రీదేవి ఏషియన్‌మాల్‌ పక్కన నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో పలువురు నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పది నెలల క్రితం జిల్లాలో 592 ఇళ్లు నిర్మించేందుకు ప్రారంభించిన పనులు కనీసం బేస్‌మెంట్‌స్థాయిని కూడా దాటలేదని ఆరోపించారు. పిల్లర్లు వేసి పనులు పూర్తి చేయకపోవడంతో భూమిలోని అవి తుప్పుపట్టిపోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ప్రతి పథకంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు వచ్చే ఇసుకలో సైతం అధికార పార్టీ నేతలు, వారి కుమారులు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పాలకులు సంబురాలు మానుకుని పాలనపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, నాయకులు సంతోష్‌నాయక్, జయపాల్, మన్సూర్‌హుస్సేన్, కొండం మధుసూదన్‌రెడ్డి, ఆక రాధాకృష్ణ, మార్క విజయ్, చాడా రఘునాథరెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement