అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు

Published Fri, Jun 16 2017 11:00 PM

అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు - Sakshi

కర్నూలు(లీగల్‌): మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఎమ్మిగనూరు తాలూకా సర్కిల్‌ పరిధిలోని నందవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలివీ. నందవరంలో పదవ తరగతి చదువుతున్న బాలిక 2014 జనవరి 17న పాఠశాలకు వెళ్లి తిరిగిరాకపోవడం తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 18న ఫిర్యాదు చేశారు. 23వ తేదీన బాలిక తన తల్లిదండ్రులతో వచ్చి తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘‘మా ఇంటి ఎదురుగా ఉంటున్న హరిజన శవాల శాంతిరాజు నీవంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానన్నాడు.
 
17వ తేదీ పాఠశాల ప్రహరీ వద్ద నిల్చున్న నన్ను ఎమ్మిగనూరు జాతరలో కొత్త బట్టలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సోదరుడైన హరిజన శవాల ఆదాం ఆటోలో తీసుకెళ్లాడు. ఎమ్మిగనూరు బస్టాండ్‌లో నన్ను బెదిరించి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌కు.. అక్కడి నుంచి గుర్తు తెలియని గ్రామం సమీపంలోని ప్రభుత్వ భవనంలోకి తీసుకెళ్లి హరిజన శవాల శాంతిరాజు 22వ తేదీ వరకు గదిలో నిర్బంధించి అత్యాచారం చేశారు. 22వ తేదీ సాయంత్రం ఎమ్మిగనూరు బస్టాండ్‌లో వదిలి నందవరానికి వెళ్లిపొమ్మని చెప్పారు.’’ అని ఫిర్యాదులో పేర్కొంది. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా మరుసటి రోజు తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై కిడ్నాప్, నిర్భయ చట్టం, అత్యాచారం సెక‌్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హరిజన శవాల శాంతిరాజు, హరిజన శవాల ఆదాంపై నందవరం పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.వి.శేషుబాబు తీర్పు చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement