నామినేషన్లు ఓకే | Sakshi
Sakshi News home page

నామినేషన్లు ఓకే

Published Wed, Mar 1 2017 11:20 PM

నామినేషన్లు ఓకే - Sakshi

–‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
– ఇక మిగిలింది ఉపసంహరణే
– టీడీపీలో టెన్షన్‌..టెన్షన్‌

అనంతపురం అర్బన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం పూర్తయ్యింది. ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లూ సక్రమంగానే ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ధ్రువీకరించారు. ఇక మిగిలింది ఉపసంహరణ ఘట్టం. ఉపసంహరణకు ఈ నెల మూడో తేదీ ఆఖరు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నిక ఏకగ్రీవమా లేక పోటీనా అనేది తేలనుంది. టీడీపీ అభ్యర్థి గుణపాటి దీపక్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించిన ఆ పార్టీ నేతలకు పైలా నర్సింహయ్య రూపంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో ‘తమ్ముళ్లు’ కంగుతిన్నారు. పైలాతో నామినేషన్‌ను ఉపసంహరింపజేయడానికి ఆ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడు దీపక్‌రెడ్డి కోసం జేసీ బ్రదర్స్‌ నేరుగా రంగంలోకి దిగారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌తో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నేరుగా మాట్లాడారు. పోటీ నుంచి పైలా వైదొలిగేలా చూడాలని కోరారు.  అలాగే పైలాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతోనూ మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది.

పైలా బరిలో ఉంటే...
    పైలా నర్సింహయ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే పోలింగ్‌ అనివార్యమవుతుంది. ఇదే జరిగితే రాజకీయ పరిణామాలు, సమీకరణలు మారే ప్రమాదం ఉందనే ఆందోళన టీడీపీ నాయకులు, మరీ ముఖ్యంగా జేసీ సోదరుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేసీ సోదరులకు సొంత పార్టీలోనే వ్యతిరేక, అసంతృప్తి వర్గం ఉంది. దీనికితోడు  పరిటాల వర్గానికి అత్యంత సన్నిహితంగా ఉండే వై.సుబ్రమణ్యం (గెడ్డం సుబ్బు) ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డారు. ఆయన అలక వహించడం, రెబెల్‌గా నామినేషన్‌ వేసేందుకు కూడా సిద్ధపడడంతో పలువురు నాయకులు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించి ఆ నిర్ణయాన్ని విరమింపజేశారు.

అయినా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు  సన్నిహితులు చెబుతున్నారు. పోలింగ్‌ జరిగితే అసంతృప్తి, వ్యతిరేక వర్గాలతో టీడీపీ అభ్యర్థికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 1,278 మంది ఉన్నారు. వీరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన వారు 40శాతం వరకు ఉన్నారు. పోలింగ్‌ జరిగితే ఈ ఓట్లు టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పడతాయి. దీనికితోడు టీడీపీలో జేసీ సోదరులతో విభేదించే వారంతా దీపక్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement