టెన్షన్‌.. టెన్షన్‌... | Sakshi
Sakshi News home page

టెన్షన్‌.. టెన్షన్‌...

Published Sat, Oct 8 2016 12:53 AM

టెన్షన్‌.. టెన్షన్‌...

  • జిల్లాలకు కేటాయింపులపై ఉద్యోగుల్లో అయోమయం
  • ఎవరు ఏ జిల్లాకు అనేదానిపై ఇప్పటికీ స్పష్టత కరువు
  • బదిలీల కోసం ఎదురు చూపులు
  • 10న ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులు
  • కొందరికి ప్రత్యేక మినహాయింపులపైనా సందిగ్ధం 
 
హన్మకొండ అర్బన్‌: 
‘సార్‌... ఏమైనా తెలిసిందా.. ఇక్కడే ఉంచుతారా.. పంపిస్తారా..? ఏ జిల్లాకు పంపిస్తారు. మార్పులకు అవకాశం ఇస్తారా.. మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు. అందుకే ఎక్కడిస్తారో అని టెన్షన్‌గా ఉంది. మీకేమైనా తెలిస్తే చెప్పండి’. ఇలా ఎక్కడ చూసినా ఉద్యోగుల మధ్య ఇదే సంభాషణ. అందరిలోనూ ‘కొత్త జిల్లాల’ టెన్షనే. వారిలో సద్దుల బతుకమ్మ... దసరా పండుగ సంతోషం కానరావడం లేదు. ఒకేసారి ఉత్తర్వులు చేతిలో పెట్టి ఏ జిల్లాకు వెళ్లమంటారోననే ఆందోళన ఉంది. కనీసం నాలుగు రోజుల ముందు తెలిసినా బదిలీ విషయంలో మానసికంగా సిద్ధమయ్యేవారు. ఇప్పుడలా లేదు. దీంతో మహిళా ఉద్యోగులు, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు. టెన్షన్‌... టెన్షన్‌గా కాలం వెళ్లదీస్తున్నారు.
 
పదో తేదీనే ఉత్తర్వులు
ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు ఆయా శాఖల వారీగా సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులకు చేరింది. వాటిని ఆమోదించి ఈ నెల 9న జిల్లాలకు పంపనున్నట్లు సమాచారం. వాటి ఆధారంగా జిల్లా కలెక్టర్‌ తుది ఉత్తర్వులు 10వ తేదీన మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే జిల్లా అధికారులు పంపిన ప్రకారం ఆమోదం పొందుతాయా... రాష్ట్ర స్థాయిలో మార్పులు చేస్తారా అన్న విషయంలో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ లెక్కన 9న రాత్రి లేదా 10న ఉదయం మాత్రమే ఎవరెక్కడికి అన్న విషయం తేలనుంది.
 
రెవెన్యూలో రహస్యంగా..
మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల వివరాలు, సీనియార్టీ విషయాలు, ప్రతిపాదనలు అందరికీ దాదాపు తెలిసే జరిగాయి. అయితే రెవెన్యూలో మాత్ర పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రహస్య సమావేశాలు, నివేదికలతో ఉద్యోగుల్లో ఉత్కంఠ మరింత పెంతున్నారు. దీంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్త మవుతోంది. ముందస్తుగా ప్రాథమిక సమాచారం చెప్పడకుండా ఒకరిద్దరు కలెక్టరేట్‌లో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
 
మినహాయింపులు ఎవరికి?
బదిలీల విషయంలో మినహాయింపులు ఎవరికి ఉంటాయన్న విషయలో కూడా స్పష్టత లేదు. మహిళలు, ఉద్యోగ సంఘాల నేతలు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి దగ్గరలో పోస్టింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా ఏ మేరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకమే.
 
కొత్త జిల్లాలకు సామగ్రి తరలింపు
కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు సామగ్రి తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. జయశంకర్, మహబూబాబాద్‌ జిల్లాలతోపాటు జనగామ జిల్లాకు జిల్లా అధికారులు సామగ్రి తరలిస్తున్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ట్రెజరీ కార్యాలయం నుంచి జయశంకర్, మహబూబాబాద్‌ జిల్లాలకు సామగ్రిని వాహనాల్లో పంపించారు. డీడీ రాజుతోపాటు అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌ తదితరులు పంపిణీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. పౌరసరఫరాల కార్యాలయం నుంచి మహబూబాబాద్‌కు, కలెక్టరేట్‌ నుంచి జనగామ జిల్లాలకు సామగ్రితో వాహనాలు బయల్దేరాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement