పులివెందులలో బాంబు కలకలం | Sakshi
Sakshi News home page

పులివెందులలో బాంబు కలకలం

Published Tue, Nov 15 2016 12:27 AM

పులివెందులలో బాంబు కలకలం - Sakshi

పులివెందుల : పులివెందుల మండలం కనంపల్లె సమీపంలోని నామాలగుండు వద్ద సోమవారం ఉదయం బాంబు పేలినట్లు వదంతులు వ్యాపించాయి. పట్టణంలోని నగరిగుట్టకు చెందిన టీడీపీ కార్యకర్త మోటు శంకరప్ప(56) తన ప్రత్యర్థులపై కేసు నమోదు చేయడానికి తనపై బాంబు దాడి జరిగినట్లు డ్రామా సృష్టించాడు. పోలీసుల కథనం మేరకు.. శంకరప్ప సోమవారం ఉదయం నామాలగుండు వద్ద ఉన్న శివాలయానికి కార్తీక సోమవారం సందర్భంగా దర్శనానికి వెళ్లాడు. అనంతపురం జిల్లా తలపుల మండలం ఏపిలిపల్లె గ్రామానికి చెందిన తన ప్రత్యర్థులు సంజీవరాయుడు, అతని అనుచరులు తనపై బాంబులు విసిరి వేటకొడవళ్లతో దాడిచేశారని..వారినుంచి తప్పించుకొని బయటపడ్డానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి శంకరప్పను స్థానిక పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. 2012 ఆగస్టు నెలలో తన ప్రత్యర్థి అయిన సంజీవరాయుడు, అతని అనుచరులు భూ తగాద విషయమై తన అల్లున్ని హత్య చేశారని ఆ కేసు మంగళవారం వాయిదా ఉందని ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు తనపై హత్యా యత్నం చేశారని శంకరప్ప  తెలిపాడు.
పోలీసు విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు :
 పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కడప నుంచి బాంబు స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంలను పిలిపించారు. వారు  అన్నికోణాలలో పరిశీలించి అక్కడ ఎలాంటి బాంబు దాడి జరగలేదని తెలిపారు.  సోమవారం సాయంత్రం  అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్పీ అన్బురాజన్‌ విలేకరులతో  మాట్లాడుతూ అక్కడ బాంబుపేలినట్లు ఎలాంటి శబ్దం రాలేదని సమీపంలోని స్థానికులు, శివాలయానికి వచ్చిన భక్తులు తెలిపారన్నారు. శంకరప్ప బాంబు పేలినట్లు చెబుతున్న ప్రదేశంలో కాగితంలో సల్ఫర్‌ను తీసుకొని వచ్చి అగ్గిపుల్లతో వెలిగించినట్లుగా తెలుస్తోందని క్లూస్‌టీం నిర్ధారించిందన్నారు. అతను తన కుడిచేతికి తానే గాట్లు పెట్టుకొని దాడి చేశారని డ్రామా ఆడినట్లు తెలుస్తోందన్నారు. శంకరప్ప తన ప్రత్యర్థులను  ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డాడన్నారు. 

Advertisement
Advertisement