Sakshi News home page

ఉనికి కోల్పోయిన ప్రతిపక్షాలు

Published Mon, Apr 24 2017 3:18 AM

ఉనికి కోల్పోయిన ప్రతిపక్షాలు

తొర్రూరులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
తొర్రూరు(పాలకుర్తి): రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోల్పోయి కాపాడుకోలేని స్థితిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈనెల 27న హన్మకొండలో నిర్వహించే టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ విజయవంతానికి పాలకుర్తి నియోజకవర్గ స్థాయి టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన ఆదివారం తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని ఎల్‌వైఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు, పార్టీ కార్యకర్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జలయజ్ఞం పేరుతో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు మింగేశారన్నారు. వారి కళ్లకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అవినీతి, అక్రమాలుగానే కనిపిస్తాయన్నారు.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీకి అసలు నాయకత్వమే లేక, ఉన్న ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే రానున్న సీఎంగా మారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు ఉండదన్నారు.

సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, రైతు రుణమాఫీ, ఖరీఫ్, రబీలకు రూ.8వేలు ఇచ్చే పథకాలతో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.10కోట్ల నిధులు మంజూరు చేసేందుకు, పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈనెల 27న హన్మకొండలో జరిగే పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు పçసునూరి దయాకర్, అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నాయకులు జన్ను జఖార్య, సీతారాములు, రాంబాబు, యాదగిరిరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సిహ్మనాయక్, రమేష్‌గౌడ్, కర్నె సోమయ్య, దాలత్‌కౌర్, జాటోతు కమలాకర్, బాకీ లలిత, అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, రమాశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement