ఇక పోలీసులకు ఆధార్‌ ఆధారిత హాజరు | Sakshi
Sakshi News home page

ఇక పోలీసులకు ఆధార్‌ ఆధారిత హాజరు

Published Wed, Sep 7 2016 12:03 AM

ఇక పోలీసులకు ఆధార్‌ ఆధారిత హాజరు - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో ముందుండే నగర పోలీసు విభాగం మరో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం, నిందితుల్ని న్యాయస్థానంలో దోషులుగా నిరూపించేందుకే టెక్నాలజీని వాడుకుంటున్న సిటీ పోలీస్‌ అంతర్గత పరిపాలన కోసమూ దానిని వినయోగిస్తోంది. ప్రస్తుతం సిబ్బంది హాజరు నమోదు కోసం ఆధార్‌ ఆధారిత విధానాన్ని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువచ్చారు. ఎన్‌రోల్‌మెంట్‌ సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

అటెండెన్స్‌ రిజిస్టర్లకు స్వస్తి చెప్తూ...
నగర పోలీసు విభాగం సిబ్బంది హాజరును లెక్కించేందుకు హాజరుపట్టీలు, రిజిస్టర్లపై ఆధారపడేది. ఇందుకుగాను ఆయా ఠాణాలతో పాటు విభాగాధిపతుల వద్ద ఉండే రిజిస్టర్‌లో సిబ్బంది ప్రతిరోజూ సంతకాలు చేసేవారు. అయితే కొన్ని సందర్భాల్లో విధులకు గైర్హాజరైన వారు సైతం ఆ తర్వాతి రోజో, విధులకు వచ్చిన రోజో పాత తేదీల్లో సైతం సంతకాలు చేసే వారు.

ఇలాంటి అవకతవకలను గుర్తించిన ఉన్నతాధికారులు రిజిస్టర్లు/హాజరుపట్టీల విధానానికి స్వస్తి పలుకుతూ బయోమెట్రిక్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు లోపాలను గుర్తించారు. వీటిని అధిగమించిన తర్వాత అన్ని విభాగాల కార్యాలయాలతో పాటు డీసీపీ, ఏసీపీ ఆఫీసులు, ట్రాఫిక్‌–శాంతిభద్రతల విభాగం ఠాణాల్లోనూ అందుబాటులోకి  తెచ్చారు.

ఆఖరి రోజున ఎస్సెమ్మెస్‌లు...
ఈ బయోమెట్రిక్‌ హాజరును నగర పోలీసు కమిషనరేట్‌లోని ఐటీ సెల్‌ పర్యవేక్షిస్తోంది. ప్రతి నెలా ఆఖరి రోజున సిబ్బందికి ఎస్సెమ్మెస్‌లు పంపే విధానానికి ఆగస్టు నుంచి శ్రీకారం చుట్టారు. ఆ నెలలో పంచ్‌లు మిస్‌ అయిన, అసలు పంచ్‌లే చేయని రోజు లకు సంబంధించిన వివరాలు సూచి స్తూ ఈ ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నారు. దీంతో ఆయా సిబ్బంది, అధికారులు ఆ నెల్లో అధికారికంగా ఎన్ని రోజులు హాజరయ్యారు/పంచ్‌ చేశారనే దానిపై పారదర్శకతకు ఆస్కారం ఏర్పడింది.

లోకల్‌ నెట్‌వర్క్‌కు భిన్నంగా...
సాధారణంగా బయోమెట్రిక్‌ హాజరు విధానంలో నెట్‌వర్కింగ్‌ మొత్తం స్థానికంగా ఉంటుంది. ఆయా కార్యాలయాలు లేదా కమిషనరేట్‌ మొత్తాన్ని కలిపి నెట్‌వర్క్‌ చేస్తుంటారు. అక్కడ పని చేసే సిబ్బంది నుంచి వేలిముద్రలు తీసుకుని, సర్వర్‌ నిక్షిప్తం చేయడం ద్వారా బయోమెట్రిక్‌ మిషన్లకు అనుసంధానిస్తారు. ఈ డేటాబేస్‌ ఆధారంగానే బయోమెట్రిక్‌ బేస్డ్‌ హాజరు వ్యవస్థ పని చేస్తుంది. అయితే నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ వ్యవస్థను నేరుగా ఆధార్‌ డేటాబేస్‌తో అనుసంధానించారు.

ఫలితంగా ప్రత్యేక డేటాబేస్‌ అవసరం లేకుండానే నేరుగా ఆయా వ్యక్తుల హాజరు తీసుకునే అవకాశం ఏర్పడింది. ఈ విధానంలో ఎలాంటి లోపాలు, అవకతవకలకు ఆస్కారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు పోలీసు సిబ్బందికి ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేదని, మరికొందరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న విషయాలు వెలుగులోకి రావడంతో వీటిని సరిచేసేందుకు గాను కమిషనరేట్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రత్యేక ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement