పెద్దాసుపత్రిలో హాహాకారాలు | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రిలో హాహాకారాలు

Published Thu, Jun 22 2017 5:46 AM

పెద్దాసుపత్రిలో హాహాకారాలు

రాత్రి కరెంటు పోవడంతో అల్లాడిన రోగులు, వారిసహాయకులు
తెల్లవారుజామున వరకు ఇదే పరిస్థితి
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం

కర్నూలు(అగ్రికల్చర్‌) :
సర్వజన వైద్యశాలలో 24 గంటలూ కరెంటు ఉండాలి. అయితే బుధవారం రాత్రి గంటల తరబడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినా... రోగులు హాహాకారాలు పెట్టినా... పట్టించుకునే వారు లేరు. నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కు అయిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలోని వివిధ వార్డుల్లో రాత్రి 8 గంటల నుంచే కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా గైనిక్‌ విభాగంలో ఆపరేషన్‌ థియేటర్‌ మినహా అన్ని వార్డుల్లోనూ కరెంటుపోయి  అంధకారం అలుముకుంది.

ఉక్కపోత, దోమల బెడదతో బాలింతలు, గర్భిణిలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాన్పుల వార్డులో అనేకమంది పసిపిల్లలు ఉన్నా విద్యుత్‌ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  కొంతమంది రోగులకు ఆక్సిజన్‌ అందక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ట్రామా కేర్, ఎంఎం–4, ఎంఎం–6 వార్డులతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోనూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సార్‌.. రాత్రి 8 గంటల నుంచి కరెంటు లేదు.. రిపేరీ చేయండని ఆసుపత్రి అధికారులను, విద్యుత్‌ అధికారులను కోరినా పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది. 24 గంటలూ సరఫరా ఉండాల్సిన ఆసుపత్రిలో రాత్రి 8 గంటల నుంచి తెల్లవారే వరకు కరెంటు లేకపోవడం చూస్తే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
పెద్దాసుపత్రిలోని ట్రామాకేర్, కాన్పుల వార్డు తదితర వార్డుల్లో రాత్రి 8 గంటల నుంచి కరెంటు లేదు.   పిల్లలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు... చర్యలు తీసుకుని కరెంటును పునరుద్ధరించాలని డాక్టర్లను కోరినా పట్టించుకోలేదు. ఆసుపత్రి నిర్వహణ ఇంత అధ్వానంగా ఉంటే రోగులు ఏం కావాలి.
– నారాయణ, కందికాయపల్లె, పాణ్యం మండలం :

Advertisement

తప్పక చదవండి

Advertisement