చిల్లర విదిల్చారు | Sakshi
Sakshi News home page

చిల్లర విదిల్చారు

Published Sun, Jun 18 2017 11:44 PM

చిల్లర విదిల్చారు - Sakshi

వాతావరణ బీమాలో అనంతకు అన్యాయం 
- రూ.419 కోట్లతో జాబితా విడుదల
- ఒక్కో మండలానికి ఒక్కోరకంగా పరిహారం
- గోరంట్లకు అత్యధికం, సీకే పల్లికి నామమాత్రం
పరిహారం చెల్లించిన రైతులు 5,07,658 
కట్టిన ప్రీమియం రూ.280 కోట్లు
విడుదలైన మొత్తం రూ.4,190,558,190 
 
అనంతపురం అగ్రికల్చర్‌ : వాతావరణ బీమా పథకం ‘అనంత’ వేరుశనగ రైతులకు మరోసారి అన్యాయం చేసింది. ప్రకృతిని ఎదురొడ్డి పంటలు సాగుచేసి అప్పుల పాలైన రైతన్నల ఆశలపై నీళ్లు పోసింది. పంట దిగుబడులతో పాటు వర్షపాతం, గాలిలో తేమశాతం, వాతావరణ పరిస్థితులు కొంచెం అటుఇటుగా జిల్లా అంతటా ఒకేలా ఉన్నా పరిహారం వర్తింపులో మాత్రం కొన్ని మండలాలకు తీరని అన్యాయం జరిగింది. 
 
జిల్లా వ్యాప్తంగా గతేడాది 5.50 లక్షల మంది రైతులు రూ.4,434 కోట్లు పంట రుణాలు రెన్యూవల్‌ చేయించుకోగా, అదులో 98శాతం మంది వేరుశనగ రైతులే ఉన్నారు. వీరంతా గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 6.10 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు. వాతావరణ బీమా కోసం తమ వాటాగా బీమా కంపెనీకి రూ.56 కోట్లు ప్రీమియం చెల్లించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కూఽడా రైతుల తరఫున చెల్లించిన మొత్తం అంతా కలిపితే రూ.280 కోట్లుగా తేలింది. వాతావరణ అనుకూలించక గత ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ మొత్తం తుడిచిపెట్టుకుపోగా రైతులు అప్పుల పాలయ్యారు. దీంతో వాతావరణ బీమాపై రైతులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం బజాజ్‌ అలయెంజ్‌ కంపెనీ నుంచి వాతావరణ బీమా పరిహారం మంజూరు జాబితా విడుదలైంది. కానీ ఈ పరిహారం రైతుకు ఏ మాత్రం మేలు చేసేదిగా లేదు. మరోవైపు మండలానికో రకంగా పరిహారం విడుదల చేయడంతో రైతన్న గగ్గోలు పెడుతున్నారు. మెజార్టీ మండలాల రైతులకు చిల్లర వేసినట్లు పరిహారం విదిల్చారు.
 
ఆశలు అడియాసలేనా?
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జిల్లా అంతటా 90 శాతానికి పైగా పంట దారుణంగా దెబ్బతినడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వాతావరణ బీమా కింద పెద్ద ఎత్తున పరిహారం వస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులకు బీమా కంపెనీ మరోసారి ‘మాయ’ చేయడంతో లక్షలాది మంది రైతులకు నామమాత్రపు పరిహారం మంజూరైంది. విడుదల చేసిన జాబితా చూస్తే 5,07,658 మంది రైతులకు రూ.4,190,558,190 కోట్లు పరిహారం మంజూరు చేశారు. రైతుల వాటాతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద బజాజ్‌ కంపెనీకి రూ.280 కోట్ల వరకు ప్రీమియం చెల్లించడం విశేషం. పరిహారం మంజూరులో అత్యధికంగా గోరంట్ల మండలంలో 9,684 మంది రైతులకు రూ.20.45 కోట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ హెక్టారుకు రూ.14,633 వర్తింపజేశారు. ఇక్కడ ఎకరాకు రూ.5,853 ప్రకారం ఇవ్వనున్నారు. అత్యల్పంగా వచ్చిన చెన్నేకొత్తపల్లి మండలాన్ని తీసుకుంటే ఇక్కడ హెక్టారుకు రూ.1,679 అంటే ఇక్కడ ఎకరాకు రూ.670 ప్రకారం వర్తింపజేశారు. అగళి, అమరాపురం, బొమ్మనహాల్, చిలమత్తూరు, గోరంట్ల, హిందూపురం, కదిరి, కంబదూరు, నల్లచెరువు, నల్లమాడ, ఓడీ చెరువు, పరిగి, పుట్టపర్తి, రొళ్ల, తలుపుల, తనకల్లుతో పాటు మరో 10 మండలాలకు పరిహారం కొంత వరకు  బాగానే ఉన్నా...మిగతా 38 మండలాలకు తక్కువగా వచ్చింది. అందులోనూ 25 మండలాల రైతులకు ఎకరాకు మరీ తక్కువ పరిహారం వర్తింపజేశారు.  
 
 

Advertisement
Advertisement