ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోంచి గెంటేశారు | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోంచి గెంటేశారు

Published Thu, Nov 26 2015 4:20 AM

ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోంచి గెంటేశారు - Sakshi

కరీంనగర్‌లో ఘటన
 
 కరీంనగర్ క్రైం: పెళ్లి సమయంలో కట్నకానుకలు తక్కువగా ఇచ్చారని, ఆడపిల్ల పుట్టిందని.. కోడలిని ఇంట్లోంచి గెంటేశారు అత్తామామలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరికాలనీకి చెందిన లావణ్యకు గతేడాది మార్చి 23న కట్టరాంపూర్‌కు చెందిన చిలకపూరి రాజయ్య-లక్ష్మి కుమారుడు రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి కోడల్ని నిత్యం వేధించేవారు. 9 నెలల క్రితం రాజశేఖర్ భార్యకు చెప్పాపెట్టకుండా దుబాయ్ వెళ్లిపోయాడు. అప్పటికి లావణ్య గర్భిణి. ఈ క్రమంలో కట్నం తక్కువగా తీసుకువచ్చావని అత్తామామ, ఆడపడుచులు  లావణ్యను వేధించడంతో పుట్టింటికి వచ్చింది. ఆరు నెలల క్రితం మైత్రికి జన్మనిచ్చింది. పాపతో అత్తగారింటికి వెళ్లినప్పటి నుంచి లావణ్య కష్టాలు పెరిగాయి. భరించలేక కొన్ని నెలలుగా సోదరి సరిత ఇంట్లో ఉంటోంది.

మూడు రోజుల క్రితం అత్త లక్ష్మికి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో చూసేందుకు వెళ్లి అక్కడే ఉంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లోంచి వెళ్లిపొమ్మని ఆమెను ఫోన్‌లో హెచ్చరించాడు. అత్తామామ రాజయ్య-లక్ష్మి, ఆడబిడ్డ భర్త విజయ్, మరిది నరేశ్‌లు లావణ్యతో వాగ్వాదానికి దిగడంతో తిరిగి సోదరి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో విజయ్, నరేశ్ బుధవారం వివాహ సమయంలో పెట్టిన సామ గ్రి మొత్తం తీసుకువచ్చి లావణ్య ఉంటున్న ఇంటి ఎదుట వేసి వెళ్లిపోయారు. మరోసారి ఆడపిల్లను తీసుకుని వస్తే బాగుండదని హెచ్చరించినట్లు బాధితురాలు లావణ్య తెలిపింది. సమాచారం అందుకున్న మహిళా ఠాణా పోలీసులు వెళ్లి లావణ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.

Advertisement
Advertisement