Sakshi News home page

ఎదురుచూపులు

Published Fri, Jul 7 2017 4:23 AM

ఎదురుచూపులు - Sakshi

వర్షాలు లేక డెడ్‌స్టోరేజీకి చేరిన సాగర్‌ జలాశయం
3.60 లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం
నీటికోసం ఆయకట్టు రైతుల నిరీక్షణ
గత ఏడాదితో పోలిస్తే ఈసారి తగ్గిన నీటిమట్టం
నాగార్జుసాగర్‌ నిండకపోతే పరిస్థితి ఏంటని దిగులు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కర్షకుల్లో ఆందోళన
ఈనెలలో వర్షాలు కురవకపోతే ఆగస్టుపైనే చివరి ఆశలు

రెండు జిల్లాల్లో ఆయకట్టు    3,60,701 ఎకరాలు
నల్లగొండ జిల్లాలో    1,53,542 ఎకరాలు
సూర్యాపేట జిల్లాలో    2,07,159 ఎకరాలు

సాక్షి, నల్లగొండ : నైరుతి రుతుపవనాలు తొలకరితోనే సరిపెట్టుకున్నాయి. పవనాల అడ్రస్‌ లేకపోవడంతో ఎగువన వర్షాలు లేక నాగార్జునసాగర్‌ జలకళ తప్పింది. ఉమ్మడి జిల్లా పంటల సాగుకు కల్పతరువుగా ఉన్న ఈ ప్రాజెక్టు.. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ప్రస్తుత నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. వర్షాలు లేక..జలశయం నిండకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగు బెంగ పట్టుకుంది. నీళ్లు లేకపోతే పంటలను ఎలా సాగుచేయాలని కర్షకుల్లో ఆందోళనవ్యక్తమవుతోంది. సాగర్‌ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు వరుణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు.. జలాశయం ఎప్పుడునిండుతుందోనని ఆకాశంకేసి ఆశగా ఎదురుచూస్తున్నారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 3,60,701 ఎకరాల సాగర్‌ అయకట్టు ఉంది. ఇందులో నల్లగొండ జిల్లాలో 7 మండలాల్లో 1,53,542 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2,07,159 ఎకరాల్లో సాగర్‌ నీళ్లతో ఏటా ఖరీఫ్‌లో పంటలు సాగవుతాయి. రెండు జిల్లాల మొత్తం ఆయకట్టులోనే ఎడమకాల్వ ఎత్తిపోతల కింద 81,841ఎకరాలు ఉన్నాయి. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నిండి.. సాగర్‌కు వరద వస్తేనే ఆయకట్టులో సాగుకు నీటి విడుదల చేస్తారు.

అయితే గత నెలలో నైరుతి రుతుపవనాలు తొలకరితో ఊరించి మళ్లీ వెనకడుగు వేశాయి. దీంతో ఎగువన  శ్రీశైలానికి కూడా కృష్ణానది నీటి వరద లేకుండా పోయింది. ఈ పరిస్థితితో శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు చుక్కనీరు కూడా విడుదల చేయడం లేదు. గత ఏడాది ఇదే నెలలో సాగర్‌లో 506 అడుగుల మేర నీరుంటే.. ఇప్పుడు 501 అడుగులకు చేరాయి. మొత్తంగా సాగర్‌ నీటిమట్టం డెడ్‌స్టోరేజీలో ఉంది. నైరుతిరుతు పవనాల కదలికలో మందగమనంతో ఉండడంతో ఈనెలలో వర్షాలు కురస్తాయో..?లేదోనని ఆయకట్టు రైతులు ఆందోళనచెందుతున్నారు.
ఆగస్టుపైనే ఆశలు..
ఈనెలలో వర్షాలు కురవకపోతే ఆయకట్టు రైతులు ఇక వచ్చే ఆగస్టు నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. సాగర్‌ నీళ్లు ఖరీఫ్‌కు ఎలాగైనా వస్తాయని విత్తనాలు, ఎరువులు ముందస్తుగా సిద్ధంచేసుకున్నారు. తొలకరి వర్షాలతో నారుమళ్లు, దుక్కులు దున్ని పంట సాగుకు సమాయత్తమయ్యారు. కౌలు రైతులు పంట సాగుకు ముందుగానే అప్పు తెచ్చుకున్నారు. ఒకవేళ వచ్చేనెలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే పంటల సాగు ఎలా అని రైతులు తర్జనభర్జన పడుతున్నారు. ఏటా జూలై నెలలో భారీ వర్షాలు పడితే ఆగస్టు మొదటివారంలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తారు. గత నెలలో భారీ వర్షాలు లేకపోవడం, ఈనెలలో కూడా చిరుజల్లులే పడుతుండడంతో.. రైతులకు పంట సాగు రంది పట్టింది.
510 అడుగులు వస్తేనే..
నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఖరీఫ్‌లో పంటల సాగుకు నీటిని విడుదల చేయాలంటే జలాశయంలో 510 అడుగులకు పైగా నీరుంటేనే ముందుగా నారుమళ్లకు, ఆ తర్వాత జలాశయం నిండే పరిస్థితులకు అనుగుణంగా వరినాట్లకు నీటిని విడుదల చేస్తారు. గత ఏడాది ఆగస్టులో  510 అడుగులు నీరుండడంతో అప్పట్లో ఇదేనెలలో మొదటివారంలోనే పంటలకు నీటిని విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు 501 అడుగులతో డెడ్‌స్టోరేజీతోనే ఉండడంతో వర్షాలు ఎప్పుడు వస్తాయి.. సాగర్‌ ఎప్పుడు నిండుతుందోనని రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
దేవుడి మీదే భారం..
వర్షాకాలం వచ్చి నెల గడిచినా ఇంత వరకు వానల జాడేలేదు. ఖరీఫ్‌ సాగు కోసం ఇప్పటికే దుక్కులు దున్నుకొని వర్షాల కోసం దేవుడి మీద భారం వేశాం. సాగుకు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశాం. కాలం ఇలాగే ఉంటే పంటలు ఎలా సాగు చేయాలి.
– పోతనబోయిన శ్రీనివాస్‌యాదవ్, రైతు,     త్రిపురారం
వరుణుడు కరుణిస్తేనే..
దుక్కులు దున్ని పొలం సిద్ధం చేశాం. ఇప్పటి వరకు సాగుకు అనుకూలంగా వర్షాలు కురవలేదు.  వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. సాగు చేయడానికి ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పెట్టుకున్నాం. వర్షాలు కురవకపోతే వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి లేదు.
– అనుముల వెంకట్‌రెడ్డి, రైతు, త్రిపురారం

Advertisement
Advertisement