వామ్మో! ఒకటో తారీఖు!! | Sakshi
Sakshi News home page

వామ్మో! ఒకటో తారీఖు!!

Published Mon, Nov 28 2016 1:52 AM

వామ్మో! ఒకటో తారీఖు!! - Sakshi

- బ్యాంకుల్లో నోక్యాష్ ... పనిచేయని ఏటీఎంలు
- బ్యాంకుల్లో వేతనం వేస్తే నగదు ఉపసంహరణ ఎలా!
- ఇంటి యజమానికి ఏమి చెప్పాలి?   పాలాయనకు ఏమివ్వాలి?
- ఇంటి ఖర్చులపై ఉద్యోగులకు గుండెదడ
- కనీసం రూ.10 వేల నగదు చేతికిచ్చేలా చూడాలని వినతి
- పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం
 
 సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఏ బ్యాంకుకు వెళ్లినా చాంతాడంత క్యూలు.. గంటలకొద్దీ నిలబడినా క్యాష్ అందుతుందన్న నమ్మకం లేదు. ఇచ్చే నగదుకూ పరిమితులు.. ఇక 80 శాతం ఏటీఎంల్లో ‘నో క్యాష్’ అంటూ బోర్డులు.. కొన్ని ఏటీఎంలలో అప్పుడప్పుడూ కొద్దిగా నగదు పెడుతున్నా కొద్దిసేపటికే అయిపోతోంది.. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించి 19 రోజులు గడిచినా నగదు కొరత, సమస్య తీవ్రత పెరుగుతుందేతప్ప తగ్గట్లేదు... ప్రజల అవసరాలకు తగిన నగదు లభించట్లేదు.. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటో తారీఖు వస్తుందంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేతన జీవుల గుండెలు దడదడమంటున్నారుు. పాత నోట్ల రద్దువల్ల ఆదాయం తగ్గినప్పటికీ ఉద్యోగుల వేతనాలకు సమస్య లేదని, వారి బ్యాంకుఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. జీతం సొమ్మును ఎలా తీసుకోవాలనే భయం ఉద్యోగులకు పట్టుకుంది.

ఉద్యోగం చేయాలా? లేక బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచోవాలో అర్థమవక సతమతమవుతున్నారు. నగదు విత్‌డ్రాయల్స్‌పై పరిమితుల నేపథ్యంలో అవసరాలకు తగిన సొమ్మును సకాలంలో ఎలా విత్‌డ్రా చేసుకోవాలోనని ఆందోళనకు గురవుతున్నారు. అద్దెపై ఇంటి యజమానికి ఏం చెప్పాలి? పాలాయనకు ఏమివ్వాలి? కూరగాయలకు డబ్బెలా? పిల్లల నెలవారీ ఫీజులు చెల్లించేదెలా? ఇతర ఖర్చులకు చేతిలో డబ్బు అందేదెలా? అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో హర్యానా, తెలంగాణ ప్రభుత్వాల తరహాలో తమకూ వేతనంలో పదివేలో, పదిహేను వేలో నగదు రూపంలో ఇచ్చి మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేయాలన్న ఆలోచనను రాష్ట్రప్రభుత్వం చేస్తే బాగుంటుందని రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు భావించారు. అరుుతే ఉద్యోగుల వేతనాల్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించడంతో వారి ఆశలు అడియాసలయ్యారుు.

 మరింత ఇబ్బందులు తప్పవు..
 ఇప్పుడే పరిస్థితి దారుణంగా ఉందని, లక్షలాది మంది ఉద్యోగులకు వేతనాలు వచ్చినవేళ విత్‌డ్రాయల్స్‌కోసం బారులు తీరితే మరింత ఇబ్బంది తప్పదని బ్యాంకర్లు అంటున్నారు. ‘‘నగదు కొరత తీవ్రంగా ఉంది. ఇంకా ఎంతకాలం బ్యాంకుల్లో ‘నో క్యాష్’ బోర్డులు తగిలించాలి? బ్యాంకుల్లో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిని మా సర్వీసులో ఎన్నడూ చూడలేదు. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదు’’ అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంబాబు రెండు రోజులక్రితం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటన ఉద్యోగుల్లో మరింత కలవరం రేపింది. దీంతో నోట్ల కష్టాలు ఎలా అధిగమించాలా? అని తలలు పట్టుకుంటున్నారు.

 ‘అమరావతి’ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం..
 ఇదిలావుంటే.. కొత్త రాజధాని ఏర్పాటువల్ల హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ కావడంవల్ల చాలామంది పిల్లల చదువులు, ఇతర కారణాలతో కుటుంబాల్ని తరలించలేక ఒంటరిగానే అమరావతికి వెళ్లారు. దీంతో కుటుంబాలున్నందున హైదరాబాద్‌లో, అమరావతి(గుంటూరు, కృష్ణా జిల్లాల్లో) పనిచేస్తూ అద్దె ఇళ్లు తీసుకున్నందున.. రెండుచోట్లా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. దీనివల్ల ఇతర ఖర్చులూ పెరిగారుు. వారాంతంలో హైదరాబాద్‌కు వెళ్లడానికి, మళ్లీ అమరావతికి రావడానికి రవాణా ఖర్చులూ కలసి తడిసిమోపె డవుతున్నారుు. ఈ కారణంగా ఒకటోతేదీనే మొత్తం జీతం తీసుకుంటేగానీ కుటుంబాలు గడవని పరిస్థితిలో ఉద్యోగులున్నారు. ‘‘జీతం రాగానే విత్‌డ్రా చేసుకుంటేగానీ రెండుచోట్లా ఇంటి అద్దెలు, పాలబిల్లులు, కూరగాయలు, ఇతర ఖర్చులకు సరిపోదు’’ అని ఉద్యోగులు వాపోతున్నారు. రోజుకు రూ.10 వేలు, వారానికి గరిష్టంగా రూ.24 వేల నగదును బ్యాంకు నుంచి ఉపసంహరించుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు నగదును విత్‌డ్రా చేసుకున్నా రెండుచోట్లా నిర్వహణ ఖర్చులకు సరిపోవని ఉద్యోగులంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులు చాలినంత నగదు లేదంటూ ఖాతాదారుల్ని వెనక్కు పంపుతుండటం, కొన్ని బ్యాంకులు రోజుకు రూ.2వేలే ఇస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
 
 బ్యాంకుల మీద ఎంత ఒత్తిడో...
 ప్రస్తుతం బ్యాంకుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే 15.66 లక్షల మందిపైగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఒకటోతేదీ తర్వాత బ్యాంకులకు నగదు విత్‌డ్రాకోసం వస్తే పరిస్థితి ఎలాగుంటుందో ఊహించడమే కష్టంగా ఉందని బ్యాంకర్లతోపాటు ఆర్థికశాఖ అధికారులు, ఆర్‌బీఐ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 6.66 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. మరో లక్షమంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం లేదా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు వారి సొంతఖాతాకు ఆర్‌టీజీఎస్/నెఫ్ట్ ద్వారా డబ్బును ట్రాన్‌‌సఫర్ చేస్తాయి. లక్షలాది పెన్షనర్ల ఖాతాల్లోనూ పింఛన్‌ను ప్రభుత్వం జమచేస్తుంది. మరోవైపు 8 లక్షలమందికిై పైగా ప్రైవేటు టీచర్లు, ఇతర ప్రైవేటు ఉద్యోగులున్నారు. వారికీ వేతనాలు పడతాయి. వీరంతా నగదు తీసుకోడానికి క్యూకడతారు. పాత 500, వెరుు్యనోట్లను తమ ఖాతాల్లో జమచేసిన సంస్థలు ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలకింద ఈ ఖాతాల్లోని డబ్బును జమ చేస్తారుు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఖాతాల్లోని డబ్బు ఉపసంహరణకు వస్తే  చెల్లింపులు బ్యాంకులకు సాధ్యమవదు. ఒక్కోవ్యక్తికి రోజుకు రూ.10 వేలు, వారంలో గరిష్టంగా రూ.24 వేలు తీసుకోడానికి అనుమతించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసిందేతప్ప ఆ మేరకు కొత్తనోట్లు అందుబాటులోకి తేలేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
 
 పూర్తిస్థాయిలో విత్‌డ్రాకు అనుమతి ఇప్పించాలి: ఉద్యోగులు
 ‘‘ఇప్పటికే సర్వస్వం త్యాగం చేసి(కోల్పోరుు) హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం. దీనివల్ల ఖర్చులు పెరిగారుు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా ఖాతాల్లో పడిన వేతనం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇప్పించాలి’’ అని హైదరాబాద్ నుంచి అమరావతి ప్రాంతానికి వచ్చిన ఉద్యోగులు కోరుతున్నారు. లేకపోతే ఆర్థికంగా చిక్కుల్లో పడాల్సి వస్తుందంటున్నారు. దీనిపై రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. వేతనం మొత్తం విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించడంవల్ల ప్రజలకే మేలు జరుగు తుందన్నారు. ‘‘ఉద్యోగులు డబ్బు విత్‌డ్రా చేసుకునేది దాచుకోవడానికి కాదు. సరుకులు కొంటారు. దీంతో మనీ సర్‌ుక్యలేషన్‌లో ఉంటుంది. దీనివల్ల ప్రజలకు చిల్లర కొరత తీరుతుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి రావడంవల్ల ఉద్యోగులు ఆర్థికంగానేగాక అన్నివిధాలా నష్టపోయారు. ఇప్పుడు వేతనం పూర్తిస్థారుులో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించకపోతే ఖర్చులకు డబ్బుల్లేక మానసికంగానూ ఇబ్బంది పడాల్సివస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement