అక్రమాలపై అధ్యయనం | Sakshi
Sakshi News home page

అక్రమాలపై అధ్యయనం

Published Tue, Aug 9 2016 10:14 PM

అక్రమాలపై అధ్యయనం - Sakshi

  • యాంత్రీకరణ అక్రమాలపై రెండు బృందాల తనిఖీలు
  • క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అధికారులు
  • ఖమ్మం వ్యవసాయం : వ్యవసాయ యాంత్రీకరణ అమలు.. జరిగిన అక్రమాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రెండు బృందాలను నియమించింది. ఆధునిక పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్‌ఎస్‌ఎఫ్‌), రాష్ట్రీయ కృషి వికాస యోజన(ఆర్‌కేవీవై), నార్మల్‌ స్టేట్‌ ప్లాన్‌(ఎన్‌ఎస్‌పీ) వంటి పథకాల ద్వారా రూ.కోట్లు వెచ్చిస్తున్నాయి. ఈ నిధులను కొందరు అక్రమాలు కొల్లగొడుతున్నారు. 2014–15లో జిల్లాకు ఆయా పథకాల కింద విడుదలైన నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. రూ.20కోట్ల నిధుల్లో పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ.. జిల్లా వ్యవసాయ శాఖలో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించింది. అప్పటి జిల్లా వ్యవసాయ శాఖ బాస్‌(జేడీఏ) నిధులను సెల్ఫ్‌ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నట్లు నిర్ధారించారు. దాదాపు రూ.70లక్షలు డ్రా చేసుకున్నట్లు విచారణలో తేలింది. వీటిలో కొంత మొత్తాన్ని బాస్‌ తిరిగి రాష్ట్ర వ్యవసాయ శాఖకు జమ చేశారు. ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. ఇందులో ఆడిట్‌ జరగగా.. విచారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
    రెండు బృందాల తనిఖీలు
    జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ.. క్షేత్రస్థాయిలో పథకం అమలును పరిశీలించాలని.. లబ్ధిదారుల ఆధారంగా యంత్ర పరికరాలు అందాయా? వాటిని ఆయా లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారా? అధికారులు మార్గదర్శకాలను పాటిస్తున్నారా? లబ్ధిదారుల గుర్తింపు సక్రమంగా ఉందా? లేదా? తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రెండు బృందాలను నియమించింది. ఇవి సోమవారం నుంచి తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. మెదక్‌ జిల్లా సదాశివపేట సీడ్‌పామ్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు వి.విద్యాసాగర్, సిద్దిపేట ఏఓ ఆర్‌.ప్రభాకర్‌రావు ఒక బృందంగా, సంగారెడ్డి రైతు శిక్షణా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు జి.రమాదేవి, సంగారెడ్డి రైతు శిక్షణా కేంద్ర వ్యవసాయాధికారి ఎం.మీనా ఒక బృందంగా నియమితులయ్యారు. వీరు వ్యవసాయ డివిజన్‌లవారీగా తనిఖీలను ప్రారంభించారు.
    2014 నుంచి పథకం అమలుపై పరిశీలన
    2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాల యాంత్రీకరణ పథకం అమలు తీరును తనిఖీ బృందాలు పరిశీలిస్తున్నాయి. రెండేళ్ల కాలంలో.. వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లకు సంబంధించిన పలు కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవటం, ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో పథకం అమలుపై సమగ్రంగా అధ్యయనం చేయాలని రెండు బృందాలను తనిఖీలకు నియమించారు. బృందాలు ఇప్పటివరకు బోనకల్లు, చింతకాని, ఖమ్మం అర్బన్‌(రఘునాథపాలెం), సత్తుపల్లి, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో తనిఖీలు చేపట్టాయి. రైతులను కలుస్తూ.. పరికరాల వివరాలను పరిశీలిస్తున్నాయి. శుక్రవారం వరకు జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తాయని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు మణిమాల తెలిపారు. ఇక్కడ జరిగిన అక్రమాలు, అమలు తీరుపై సమగ్ర నివేదికను రూపొందించి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement