Sakshi News home page

చీరాలలో రాచరిక పాలన

Published Fri, Jun 30 2017 12:41 PM

చీరాలలో రాచరిక పాలన - Sakshi

► అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి ఇష్టారాజ్యం
► ఆయన అండతో రెచ్చిపోతున్న అనుచరులు
► అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాల ధ్వంసం
► సామగ్రి విక్రయించి సొమ్ము చేసుకున్న చోటా నేత


చీరాలలో రాజరిక పాలన నడుస్తోంది. చట్టం.. న్యాయం.. అక్కడ చట్టుబండలే. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరులు ఏది అనుకుంటే అది జరగాల్సిందే. అధికారులు, కోర్టులు జాంతానై. సర్వం ఎమ్మెల్యేనే. ఆయన ఆదేశిస్తారు.. అనుచరులు పాటిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో చీరాల ప్రజలకు బాగా తెలుసు. ఆమంచి అనుచరులు తమ స్వలాభం కోసం చివరకు ప్రభుత్వ పాఠశాలను కూడా వదల్లేదు. ధ్వంసం చేసి దాని సామగ్రిని కిలోల కింద అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మండల పరిషత్‌లో తీర్మానం చేసి సభ్యుల ఆమోదం మేరకు విద్యాశాఖ అధికారులు దగ్గరుండి శిథిల పాఠశాలను తొలగించాలి.

చీరాల టౌన్‌: పాఠశాల దేవాలయంతో సమానం. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించే ఈ దేవాలయాన్ని అధికార పార్టీ నాయకులు అధికారుల అనుమతి తీసుకోకుండా అడ్డగోలుగా కూల్చేశారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను నిలువునా కూల్చివేయడంతో అధికార పార్టీ నేతల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పది రోజుల క్రితం చీరాల అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో శిథిలావస్థకు చేరి ప్రమాదంగా ఉన్న పాఠశాలలు, తుఫాన్‌ షెల్టర్లు కూల్చి వేయాలని ఎమ్మెల్యే అధికారులకు హుకుం జారీ చేశారు. మండలంలోని వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెంలో 1 నుంచి 3 తరగతి వరకు, 4 నుంచి 5 తరగతి వరకు 2 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఆనుకుని తుఫాన్‌ షెల్టర్‌ కూడా ఉంది. తుఫాన్‌ షెల్టర్‌ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా ఉండటంతో పాటు స్కూల్‌కు ఆనుకుని ఉండటంతో స్కూల్‌ భవనం కొతం శిథిలావస్థకు చేరకుంది.  కీర్తివారిపాలెం తుఫాన్‌ షెల్టర్‌తో పాటు శిథిలావస్థకు చేరిన స్కూల్‌ భవనాన్ని కూడా తొలగించాలని ఎమ్మెల్యే స్థానిక అధికార పార్టీ నాయకులను ఆదేశించారు. చట్ట ప్రకా రం అన్ని అనుమతులు తీసుకుని మండల తీర్మానంతో పాటు పంచాయతీ పాలకవర్గం అనుమతితో స్కూల్‌ భవనాన్ని తొలగించాలి.

అనుమతులు..జాంతానై
ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాత్రం ఎలాంటి తీర్మానాలు లేకుండానే అధికార పార్టీ నాయకుడినన్న గర్వంతో చదువుల కోవెలను క్రేన్‌ సాయంతో ఇష్టానుసారం పగలగొట్టించాడు. ప్రభుత్వ స్కూల్‌ను టీడీపీ నాయకుడు అనుమతి లేకుండా ధ్వసం చేస్తున్నాడని పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ప్రభుత్వ స్కూల్‌ను పగలకొట్టడం ఎందుకని ప్రశ్నించిన గ్రామస్తులతో సంబంధిత టీడీపీ నాయకుడు దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.. అంతా నా ఇష్టం.. అడ్డు వస్తే మీకే నష్టం.. అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాడు. గ్రామంలోని స్కూల్‌ను అనుమతి లేకుండా ధ్వంసం చేస్తున్నా పంచాయితీరాజ్, విద్యాశాఖ, ఎంపీడీవోలు కనీసం గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తడం సమంజసం కాదని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం నుంచి వచ్చిన ఇనుము, ఇతర సామగ్రిని సైతం టీడీపీ నేత అమ్ముకుంటున్నాడు.  

పంచాయతీ అనుమతి ఇవ్వలేదు:
మా గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనాలు తొలగించాలని మండల పరిషత్‌ నుంచి పంచాయతీకి ఎలాంటి తీర్మానాలు రాలేదు. కీర్తివారిపాలెంలో ప్రభుత్వ స్కూల్‌ను పగలగొట్టేందుకు ఎవరికీ పంచాయతీ అనుమతి ఇవ్వలేదు.    – ఎరిపిల్లి రమణ, సర్పంచ్, వాడరేవు 

నాకేమీ తెలియదు :
కీర్తివారిపాలెం ఎంపీపీ స్కూల్‌ను పగలకొడుతున్నారని నాకు తెలియదు. ఎవరు పగలకొడుతున్నారో కనుక్కుంటా. శిథిల భవనాలు తొలగించాలంటే మండల పరిషత్‌ నుంచి అనుమతులు అవసరం. సభ్యుల తీర్మానం కూడా ఉండాలి. తీర్మానం లేకుండా ధ్వంసం చేయడం సరికాదు. అధికారులతో విచారణ జరిపించి కారణాలు తెలుసుకుంటా. – వెంకటేశ్వర్లు, ఎంపీడీవో

Advertisement
Advertisement