నీరు – చెట్టు అక్రమాలపై నేడు హైకోర్టులో విచారణ | Sakshi
Sakshi News home page

నీరు – చెట్టు అక్రమాలపై నేడు హైకోర్టులో విచారణ

Published Wed, Feb 8 2017 11:08 PM

నీరు – చెట్టు అక్రమాలపై నేడు హైకోర్టులో విచారణ - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు :  కోవూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు కింద జరిగిన అక్రమాలపై బుధవారం హైకోర్టులో విచారణ సాగనుంది. నియోజకవర్గంలో రూ.350కోట్ల మేర అవినీతి జరిగిందని కొందరు తెలుగుదేశంపార్టీ నాయకులతో పాటు రైతు నాయకులు రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆదేశం మేరకు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఇరువర్గాల పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు బుధవారం నుంచి విచారణ ప్రారంభించనుంది.  

కోవూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు, వరద నష్టం పనులు(ఎఫ్‌డీఆర్‌), జాతీయ ఉపాధి హామీ పథకం, ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌(ఓఅండ్‌ఎం) నిధుల కింద భారీ ఎత్తున పనులు చేపట్టారు. శాసనసభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, కొందరు తెలుగుదేశం నాయకులు ఈ పనుల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని పనులను చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి నాయకులు 60 శాతం, అధికారులు, ఉద్యోగులు 40 శాతం నిధులు దిగమింగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.  

రెండు మూడు పథకాల కింద ఒకే పని
ఒకే పనిని రెండు మూడు పథకాల కింద చేసినట్లు చూపించి నిధులు కొల్లగొట్టారు. సాగునీటి సంఘాల పాలకవర్గాలకు తెలియకుండానే నెల్లూరులో బోగస్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరచి నీటి సంఘాల ద్వారా పనులు చేసినట్లు నిధులు గోల్‌మాల్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కోవూరు నియోజకవర్గంలోనే రూ.350 కోట్ల అవినీతి జరిగిందని ఆయకట్టు సంఘాలు, ఆయకట్టు సంఘాల నాయకులు, రైతు ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు, నీటి పారుదలశాఖ ఎస్‌ఈకి ఫిర్యాదులు ఇచ్చారు. అయితే అధికారులు నామమాత్రపు విచారణలు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా విషయం అటకెక్కించారు.

ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ నాయకులు, రైతు సంఘాల నాయకులు తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన అవినీతి వ్యవహారంపై విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. వివాదం హైకోర్టుకు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు హడావుడిగా కొందరు కిందిస్థాయి ఉద్యోగులను బదిలీ చేసి తాము చర్యలు తీసుకున్నామని చూపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నీరు–చెట్టులో కోవూరు నియోజకవర్గంతో పాటు సర్వేపల్లి, నెల్లూరురూరల్, గూడూరు, సూళ్లూరుపేట, కావలి నియోజకవర్గాల్లో కూడా రెండున్నరేళ్లలో సుమారు రూ.1000 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ అక్రమాలపై మీడియాలో పెద్ద ఎత్తున వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఫిర్యాదుదారులు వీటన్నింటిని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.

Advertisement
Advertisement