‘పెద్ద రిజర్వాయర్లపై సర్కారు తీరు సబబే’ | Sakshi
Sakshi News home page

‘పెద్ద రిజర్వాయర్లపై సర్కారు తీరు సబబే’

Published Thu, Aug 18 2016 5:29 PM

The way the government treatment is fine on large reservoirs

గోదావరి, కృష్ణా పరీవాహకంలో ప్రతి నీటి చుక్కను వినియోగించుకునేందుకు పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరని ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం స్పష్టం చేసింది. ఈ దృష్ట్యానే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఎక్కువ రిజర్వాయర్లను ప్రభుత్వం తలపెట్టిందని తెలిపింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సాంబయ్య, సత్తిరెడ్డి తదితరుతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 కాంగ్రెస్ ప్రజెంటేషన్‌లో చెప్పిన అంశాలను ఫోరం సభ్యులు తప్పుపట్టారు. ప్రాణహిత -చేవెళ్ల పథకంలో భాగంగా ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత పుష్కలంగా లేనందునే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకునే కాళేశ్వరం పథకాన్ని ప్రభుత్వం మొదలుపెట్టినట్లు రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరామని, దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు.

ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తెచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో పైప్‌లైన్ ద్వారానే నీటిని సరఫరా చేసే విధానం పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించగా, దానికి సమ్మతించిందని అన్నారు. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్ నిర్మాణ వ్యవస్థ ఖర్చు తక్కువగా ఉండటం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలుండటం, నీటి ఆదా సైతం హెచ్చుగా ఉన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాల్వల ద్వారా టీఎంసీలకి 10వేల ఎకరాలకు మాత్రమే నీరిచ్చే అవకాశం ఉండగా, పైప్‌లైన్ వ్యవస్థలో 20వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలుంటాయని తెలిపారు. పైప్‌లైన్ నిర్మాణాలకు భూసేకరణ అవసరాలు తక్కువగా ఉండటంతో పాటు. అన్ని ప్రాంతాలకు సమానమైన నీటిని పంపిణీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విధానాన్ని పాలమూరు, డిండి ప్రాజెక్టుల్లోనూ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement