జన్మభూమి సభలకు స్పందన కరువు | Sakshi
Sakshi News home page

జన్మభూమి సభలకు స్పందన కరువు

Published Tue, Jan 3 2017 10:17 PM

జన్మభూమి సభలకు స్పందన కరువు - Sakshi

- రేషన్‌ కార్డుల కోతపై జనం నిరసన
- గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు ఏమయ్యాయని ప్రశ్నించిన జనం
- ఉపాధి పనులకు బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమం మొదటి రోజు అనేక చోట్ల జనంలేక వెలవెల బోయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీనేతలు అధికారులతో కలసి సభలు నిర్వహించారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకు దిక్కులేకపోవడం, రేషన్‌ కార్డుల మంజూరులో కోత పడటంతో జనం అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు 23వ డివిజన్‌లో జరిగిన సభను బీజేపీ కార్పొరేటర్‌ అపర్ణ బహిష్కరించారు. మంత్రి నారాయణ నెల్లూరు కార్పొరేషన్‌లో జన్మభూమి సభలు ప్రారంభించారు. కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, సంయుక్త కలెక్టర్‌ ఇంతియాజ్, మేయర్‌ అజీజ్‌ ఈ సభల్లో పాల్గొన్నారు.

► కావలి పట్ణణం 4వ వార్డులో జరిగిన జన్మభూమి సభలో  చైర్‌పర్సన్‌ అలేఖ్యతో పాటు ఆమె భర్త  శ్రీ కాంత్‌ కూడా వేదికనెక్కారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్‌ కార్డు అందించడానికి ఒక మహిళను వేదిక మీదకు పిలిచారు. దీన్ని జీర్ణించుకోలేని చైర్‌పర్సన్‌ భర్త  శ్రీకాంత్‌ ఆ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ వ్యవహార తీరుపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
► దుత్తలూరు మండలం తిమ్మాపురం, రెడ్లదిన్నె గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని కూలీలు అధికారులను నిలదీశారు. రెడ్ల దిన్నె గ్రామంలో మూత పడిన పాఠశాలను తెరిపించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.
► కలిగిరి మండలం వీర్నకొల్లులో తమ గ్రామానికి సిమెంటురోడ్లు వేయాలని ప్రజలు అధికారులను నిలదీశారు. తెల్లపాడు

గ్రామంలో ఉపాధి పనులు చూపడంలేదని కూలీలు అధికారులకు ఫిర్యాదు చేశారు.  
► కావలి రూరల్‌ మండలం ఆముదాలదిన్నెలో శ్మశాన స్థలం ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. 
► సర్వేపల్లిలో 850 మంది తెల్లరేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే 250 మాత్రమే మంజూరు కావడంపట్ల ప్రజలు అధికారులను నిలదీశారు.  
► వాకాడులో జన్మభూమి సభకు జనం రాక వెలవెలబోయింది. అధికారులే ప్రభుత్వ పథకాలు గురించి మాట్లాడుకొని వెళ్లిపోయారు.  ► నెల్లూరు సిటీలోని 23వ డివిజన్‌లో జరిగిన జన్మభూమి సభను బీజేపీ కార్పొరేటర్‌ ఎర్రబోలు అపర్ణ బహిష్కరించారు. గత జన్మభూమిలో అధికారుల దృష్టికి తీసుకుపోయిన సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.  
► బుచ్చిరెడ్డి పాళెం మండలం చెల్లాయపాలెంలో నిర్వహించిన జన్మభూమి సభలో వేదిక మీద అధికార పార్టీ నేతలే ఆశీనులు కావడంతో విశ్రాంత ఉద్యోగి పి. భాస్కర్‌రావు ఎంపీడీవో నరసింహారావును నిలదీశారు. ఇది అధికారిక సభా లేక టీడీపీ సభా అని ప్రశ్నించారు. గతంలో చెప్పిన సమస్యలు ఇంత వరకు పరిష్కారం కాకుండా అధికారులు మళ్లీ జన్మభూమి సభలకు ఎందుకు వచ్చారని జనం నిలదీశారు.
► పొదలకూరు మండలం ఇనుకుర్తి, దుగ్గుంట గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.  ఇక్కడ వైఎస్సార్‌ సీపీ నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చనే అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
► వింజమూరు మండలం చాకలికొండ సభలో వేలి ముద్రలు పడలేదని తమకు రేషన్‌ సరుకులు నిలిపివేశారని ప్రజలు అధికారులను నిలదీశారు.
► సీతారామపురం మండలం బాలా యపల్లిలో జరిగిన గ్రామ సభలో ఎంపీపీ జనార్దన్‌రెడ్డి అధికారుల వైఖరి మీద ధ్వజమెత్తారు.గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలకు సంబంధించి పనులు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement