చస్తే.. పూడ్చే స్థలమేది | Sakshi
Sakshi News home page

చస్తే.. పూడ్చే స్థలమేది

Published Sat, Dec 10 2016 10:30 PM

చస్తే.. పూడ్చే స్థలమేది - Sakshi

పోలవరం నిర్వాసితుల నిరసన
 మృతదేహాన్ని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో పూడ్చేందుకు యత్నం
 కేసు నమోదు చేసిన పోలీసులు
పోలవరం :
పునరావాస కేంద్రాల్లో ఉంటున్న పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులైన దేవరగొంది గిరిజనులు శ్మశాన వాటికకు స్థలం కేటాయించలేదంటూ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న కొణుతుల రఘుపతి (52) అనే గిరిజన మహిళ శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. దాదాపు 100 మంది నిర్వాసితులు మృతదేహంతో పోలవరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని అక్కడి ఆవరణలో మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యి తవ్వారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించకపోవడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. దీంతో తహసీల్దార్‌ ఎం.ముక్కంటి, ఎస్సై కె.శ్రీహరిరావు నిర్వాసితులతో చర్చలు జరిపారు. దేవరగొంది నిర్వాసితులకు శ్మశాన వాటిక కోసం జీరో పాయింట్‌ వద్ద రెండెకరాల స్థలాన్ని కేటాయించామని, ఆ స్థలాన్ని చూపిస్తానని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. షెడ్డు నిర్మాణం, బోరు , లెవలింగ్‌ పనులకు ప్రతిపాదనలు పంపామన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఈ విధంగా చేయడం తగదని నిర్వాసితులకు సూచించారు. శాంతించిన నిర్వాసితులు మృతదేహాన్ని ఆవరణ నుంచి శ్మశాన వాటిక కోసం సేకరించిన స్థలంలోకి తీసుకెళ్లి అక్కడ ఖననం చేశారు. ఇదిలావుండగా, మృతదేహాన్ని తీసుకొచ్చి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో పూడ్చిపెట్టేందుకు గిరిజనులు ప్రయత్నించడంపై తహసీల్దార్‌ ఎం.ముక్కంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పని చేయడం నిబంధనలకు విరుద్ధమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎస్సై కె.శ్రీహరిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
Advertisement