చివరి క్షణం వరకూ నవ్వించాలని ఉంది | Sakshi
Sakshi News home page

చివరి క్షణం వరకూ నవ్వించాలని ఉంది

Published Wed, May 3 2017 11:41 PM

చివరి క్షణం వరకూ నవ్వించాలని ఉంది - Sakshi

‘నవ్వడం ఓ భోగం.. నవ్వించడం ఓ యోగం.. నవ్వకపోవడం ఓ రోగం’ అంటారు హాస్యబ్రహ్మ జంధ్యాల. తనకు ఎన్ని బాధలున్నా ఇతరులను నవ్వించడమే జీవితమని భావించే హాస్యనటులు తెలుగు సీమలో ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే అనంతపురం జిల్లాకు చెందిన తిరుపతి ప్రకాష్‌. జీవితం అంటే భోగాలు, పొగడ్తలే కాదు.. కష్టాలు, విమర్శలు  కూడా ఉంటాయని వాటిని సమానంగా తీసుకున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్‌ చేయగలమని చెప్పే తిరుపతి ప్రకాష్‌ మంచి నటుడే కాదు.. తరచి చూస్తే అతనిలో ఓ వ్యక్తిత్వ వికాసనిపుణుడూ కనిపిస్తాడు. సొంత పనిపై  అనంతపురానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
- అనంతపురం కల్చరల్‌

సాక్షి : మీ బాల్యమంతా ‘అనంత’లోనే గడిచిందా?
తిరుపతి ప్రకాష్‌ : మా సొంతూరు ఉరవకొండ వద్ద తిమ్మాపురం అయినా దాదాపు అనంతపురంలోనే ఉన్నాం. మా నాన్నగారు టి.కె.రామ్మూర్తిరావు పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేసేవారు. ఆయన డ్యూటీపై ఎక్కడకెళితే అక్కడ చదువుకోవాల్సి వచ్చింది. అనంతపురంలోని మూడో రోడ్డులోని  గొంగడి రామప్ప మిషన్‌లో సెయింట్‌ ఆంథోని స్కూల్‌ ఉండేది. అక్కడ 9, 10 తరగతులు, ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీలో ఇంటర్‌ వరకు చదువుకున్నాను. నాన్నగారు ఎస్పీగా హైదరాబాదుకు బదిలీ కావడంతో అక్కడకు వెళ్లిపోయాను. ఇప్పటికీ సొంతిల్లు, కుటుంబం ఇక్కడే ఉంది.

సాక్షి : చలనచిత్ర నటుడిగా అవకాశం ఎలా దక్కింది?
తిరుపతి ప్రకాష్‌ :   నాకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. తిరుపతి యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడు ‘బియ్యం గింజలో వడ్ల గింజ’ నాటకాన్ని వేశాం. అందులో నాకు బెస్ట్‌ కమెడియన్‌ అవార్డు వచ్చింది. ఈ నాటకానికి న్యాయనిర్ణేతగా ప్రముఖ సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ హాజరయ్యారు. నా నటనను ఆయన బాగా మెచ్చుకున్నారు. ఆయన సహాయ దర్శకుడు ఆదినారాయణ ద్వారా ఈవీవీ సినిమా ‘జంబలకడి పంబ’లో తొలిసారి వేషం వేశాను.  అలా ప్రారంభమై ఇప్పటికి 220 సినిమాలు వరకు చేశాను.

సాక్షి : ఇప్పుడు కొంచం అవకాశాలు తగ్గినట్టు అనిపించడం లేదా?
తిరుపతి ప్రకాష్‌ : కొంచమేమీ.. చాలా తగ్గాయని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కొత్త నీరు వస్తుంటే పాత నీరు పక్కకు పోవడం సహజమే కదా. ఇది నాకే కాదు.. బ్రహ్మానందం గారి నుంచి ప్రతి కమెడియన్‌ ఎదుర్కొంటున్న సమస్యే. కానీ నన్ను సినిమాకు మించి బుల్లితెర అవకాశాలిస్తోంది.  దానికి చాలా రుణపడి ఉండాలి.

సాక్షి : వెండి తెర నుంచి బుల్లి తెరకు రావడాన్ని ఫీల్‌ అవుతున్నారా?
తిరుపతి ప్రకాష్‌ : ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఒకప్పటి సినీ పరిశ్రమ వేరు. ఇప్పుడు వేరు. ఒకటి రెండు సినిమాలకు చాలా మంది నటీనటులు పరిమితమవుతున్నారు. బుల్లితెర అలా కాదు..నేరుగా ప్రేక్షకుల ఇంటిలో హల్‌చల్‌ చేస్తుంది. దాదాపు సినీ నటులందరూ టీవీ సీరియల్స్‌లో పనిచేస్తుండడం వల్ల వాటి మధ్య గ్యాప్‌ తగ్గిపోయింది. నా వరకైతే టీవీ ద్వారానే ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందని నమ్ముతాను.

సాక్షి : టీవీ సీరియల్స్‌లో విలువలు ఉండడం లేదంటారు. వాస్తవమేనా?
తిరుపతి ప్రకాష్‌ :  కొంత వరకు నిజం ఉండొచ్చు. కానీ విలువలనేవి మారుతున్న కాలాన్ని బట్టి ఉంటాయి. ప్రేక్షకులు కోరుకునే అంశాలే  వస్తున్నాయి మినహా మరొకటి ఉండడం లేదు. విలువలనేవి మాత్రమే చూస్తే ప్రేక్షకులింతగా ఆదరించే వారు కాదు.

సాక్షి :  మిమ్మల్ని ప్రోత్సహించిన దర్శకుల గురించి చెప్పండి?
తిరుపతి ప్రకాష్‌ : నన్నే కాదు..తెలుగు పరిశ్రమలో కమెడియన్స్‌కు నాలుగు వేళ్లు నోట్లోకెళుతున్నాయంటే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ గార్ల పేర్లే ముందుగా చెప్పుకోవాలి. అలాగే అందరు దర్శకులతో పాటు పెద్ద హీరోలందరూ నన్ను ప్రోత్సహించారు. ఇరవై ఏళ్ల కిందట చిరంజీవి, పవన్‌కల్యాణ్, నరేష్, రాజేంద్రప్రసాద్‌ వంటి వారితో స్నేహితునిగా నటించాను.

సాక్షి :  బాహుబలి సినిమా టిక్కెట్‌ దొరకలేదంటే  బాధగా లేదా?
తిరుపతి ప్రకాష్‌ : అసలు లేదు. అదే జీవితమంటే. ఏసీల్లో బతకాల్సిరావచ్చు. లేదా రోడ్లపై ఒంటరిగా తిరగాల్సి రావచ్చు. అన్నింటికి మానసికంగా సిద్ధం కావాలి. నా సొంతూరిలో నాకు టిక్కెట్టు ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటే ఓ మంచి సినిమాకు ఎంత ఆదరణ ఉందో అర్థః చేసుకోవచ్చు. నా ముందున్న వారికి కాకుండా వెనకొచ్చిన నాకు టిక్కెట్‌ ఇవ్వమని అడగలేను.

సాక్షి :  ‘అనంత’కు  మీరేమైనా చేయలేరా ?
తిరుపతి ప్రకాష్‌ : తప్పకుండా చేయాలనే ఉంది. అయితే కొన్ని చోట్ల సినిమా వాళ్లను అడ్డుపెట్టుకుని వ్యాపారం చేసిన సంఘటనలు బాధ కల్గించాయి. అలా కాకుండా నా సహకారంతో మంచి జరుగుతుందనుకుంటే ఎన్ని రోజులైనా ఓ మంచి పని చేసే వారికి నా సమయాన్ని  కేటాయిస్తాను.

Advertisement

తప్పక చదవండి

Advertisement