పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన బొగ్గులారీ | Sakshi
Sakshi News home page

పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన బొగ్గులారీ

Published Thu, Jul 14 2016 4:05 AM

పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన బొగ్గులారీ - Sakshi

వేంసూరులో ముగ్గురు వృద్ధుల్ని బలిగొన్న లారీ అతివేగం
అరటిపండ్ల పాకలోకి దూసుకెళ్లడంతో దుర్ఘటన


పింఛన్ రెన్యువల్ జిరాక్స్‌ల కోసం వచ్చిన
ఓ వృద్ధురాలు..పొట్ట కూటికోసం అరటి పండ్లు అమ్ముకునే వృద్ధుడు, పండ్లు కోనేందుకు వచ్చిన మరో పెద్దాయనను లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చి బలిగొంది. ప్రమాద స్థలిలో రక్తపు మద్దలు...ఛిద్రమైన శరీరాలను చూసి..అంతా అయ్యో.. ఎంత ఘోరం జరిగిందే..అని బాధ పడ్డారు. తీరని విషాదంతో మృతుల కుటుంబాల వారు బోరున విలపించారు.

తీరని విషాదం..
అనుకొని దుర్ఘటనతో ఇంటి పెద్ద దిక్కులను కోల్పోవటంతో మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. మృతుడు ఎండీ మహబూబ్ అలీ (60)కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అరటి పండ్లు కొనేందుకు వచ్చిన కంకటి కృష్ణమూర్తి(65)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కోట నాగరత్నం(68)కు ముగ్గురు కుమారులు ఉన్నారు.

 ఎమ్మెల్యేలు సండ్ర, జలగం  ఫోన్‌లో పరామర్శ..
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావులు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

వేంసూరు: బొగ్గులోడుతో సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ బుధవారం సాయంత్రం వేంసూరు సెంటర్‌లో రోడ్డు పక్కన పాకలో నిర్వహిస్తున్న అరటిపండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ముగ్గురు వృద్ధులు దుర్మరణం చెందారు. అరటి పండ్లు విక్రయిస్తున్న ఎండీ.మహబూబ్ అలీ (60), కొనేందుకొచ్చిన కంకటి కృష్ణమూర్తి(65), పింఛన్ రెన్యువల్ జిరాక్స్‌ల కోసం వెళ్లి వస్తూ అక్కడ ఆగిన కోట నాగరత్నం(68) అక్కడికక్కడే చనిపోయారు. మృతులంతా వేంసూరు వాసులే. వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొని దుకాణం పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి ప్రాంగణం మీదుగా మరో హోటల్ వద్దకు వెళ్లి ఆగింది. ఆ సమయంలో హోటల్ మూసి ఉండడం, ఆలయం వద్ద ఎవరూ లేకపోవడంతో మరో ప్రమాదం తప్పింది. లారీ దూసుకెళ్లడంతో మహబూబ్ అలీ, నాగరత్నం శరీరాలు ఛిద్రమయ్యాయి. తీవ్రంగా గాయపడిన కంకాటి కృష్ణమూర్తిని సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్  కొత్తపల్లి నరసింహారావుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో సత్తుపల్లికి తరలించారు.

భీతవాహ ఘటన..
లారీ ముందు భాగం తుక్కుతుక్కుగా మారి..శిథిలాల్లో మహబూబ్‌అలీ మృతదేహం చిక్కుకుంది. పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమై..క్రేన్ ద్వారా లారీని పైకిలేపి డెడ్‌బాడీని బయటకు తీశారు. ప్రధాన రోడ్డు వెంట..ఈ భీతవాహ సంఘటనతో వేంసూరులో విషాధ చాయాలు నెలకొన్నాయి. వందలాది మంది ప్రమాదస్థలికి చేరుకొని..అయ్యో..పాపం అంటూ బాధ పడ్డారు. సీఐ రాజిరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ గోవిందరావు పరిశీలించారు. ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement