తిరుమల కొండకు మూడో ఘాట్? | Sakshi
Sakshi News home page

తిరుమల కొండకు మూడో ఘాట్?

Published Thu, Oct 29 2015 4:39 AM

తిరుమల కొండకు మూడో ఘాట్?

♦ పరిశీలనలో అన్నమయ్య పురాతన మార్గం
♦ అలిపిరి నుంచి మరో కొత్త రోడ్డుకూ టీటీడీ యోచన
 
 సాక్షి, తిరుమల: రెండో ఘాట్‌లో కొండ చరియలు కూలుతున్న నేపథ్యంలో తిరుమల కొండకు మూడో ఘాట్ నిర్మించాలని టీటీడీ యోచిస్తోంది.  నాడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివచ్చిన మామండూరు పురాతన మార్గాన్ని దీనికోసం పరిశీ లిస్తోంది. అలిపిరి నుంచి మరో కొత్త రోడ్డు నిర్మాణంపైనా యోచిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాల కల్పించే దిశగా ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.

 ప్రమాదపు అంచుల్లో రెండో ఘాట్ రోడ్డు
 తిరుమల శేషాచల కొండలు 250 కోట్ల సంవత్సరాలకు ముందు ఆవిర్భవించినట్టు భౌగోళిక శాస్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తోంది. 1944, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు (తిరుమల నుంచి తిరుపతికి)ను, 1973లో రెండో ఘాట్ రోడ్డు (తిరుపతి నుంచి తిరుమలకు)ను నిర్మించారు.  మొదటి ఘాట్ లో కొండలు చరియలు కూలే అవకాశాలు తక్కువ. 16 కిలోమీటర్లు నిడివిగల రెండో ఘాట్ రోడ్డులో మాత్రం 7వ కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  భవిష్యత్‌లో భారీ కొండలే కూలే  ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం టీటీడీ పూనుకుంది.

 పరిశీలనలో అన్నమయ్య పురాతన మార్గం
 ఆరు శతాబ్దాలకు ముందు తాళ్లపాక అన్నమాచార్యులు వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు సమీపంలోని తాళ్లపాక నుంచి తిరుమలకు వచ్చారని చరిత్ర. ఈ మార్గాన్ని అన్నమయ్య మార్గంగా పిలుస్తున్నారు. మామండూరు నుంచి సుమారు 16 కిలోమీటర్లు మధ్యలో కొండలు లేకుండానే తిరుమలకు చేరుకునేలా కచ్చారోడ్డు ఉంది. దీన్ని ఆధునీకరించి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మించాలన్న డిమాండ్ కూడా ఉంది. రెండోఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారడం, అన్నమయ్య మార్గాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆ మార్గాన్ని టీటీడీ పరిశీలిస్తోంది.

 అవరోధాల మధ్య అన్నమయ్య మార్గం
 మామండూరు నుంచి తిరుమల పొలిమేరలకు వచ్చే వరకు అటవీ ప్రాంతమంతా రిజర్వు ఫారెస్ట్. అరుదైన వృక్ష, జంతువులు ఎక్కువగా ఈ శేషాచల పరిధిలోనే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కేంద్రం శ్రీవేంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించి రక్షిస్తోంది. ఈ చట్టం కింద కట్టెపుల్లను కూడా తొలగించేందుకు నిబంధనలు అంగీకరించవు. తిరుమల, తిరుపతితో మాత్రమే ముడిపడిన దేవస్థానం తిరుపతి మార్గాన్ని కాదని మామండూరు ప్రాంతానికి కొత్త రోడ్డు మార్గం విస్తరణకు ఇక్కడి స్థానికులు అంగీకరించే పరిస్థితులు తక్కువ . ఇలాంటి పరిస్థితుల మధ్య పురాతన అన్నమయ్య మార్గం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకమే.

 అలిపిరి నుంచి కొత్త రోడ్డుకు యోచన
 7 నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే అవకాశాలున్న రెండో ఘాట్ రోడ్డు కింద భాగంలోనే కొత్త రోడ్డు నిర్మించే అంశం కూడా పరిశీలనలో ఉంది. అలిపిరి నుంచి వినాయకస్వామి ఆలయం, జూపార్క్ మీదుగా హరిణి దాటుకుని 12వ కిలోమీటరు వరకు కొండల మధ్య కాకుండా నేల మీదే కొత్త రోడ్డు నిర్మించి లింక్ రోడ్డుకు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల కొంతవరకు ప్రమాదాలను అరిక ట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కూడా టీటీడీ పరిశీలిస్తోంది.

Advertisement
Advertisement