2050 వరకు అధికారంలో ఉండాలి | Sakshi
Sakshi News home page

2050 వరకు అధికారంలో ఉండాలి

Published Mon, May 30 2016 12:57 AM

2050 వరకు అధికారంలో ఉండాలి - Sakshi

- మహానాడు ముగింపులో సీఎం చంద్రబాబు  
- 28 తీర్మానాలు ఆమోదం
 
 సాక్షి, చిత్తూరు: రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది 2029 నాటికి దేశంలో మొదటి స్థానంలో, 2050 నాటికి ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేలా కృషి చేయడమే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సాధించాలంటే అప్పటి వరకు అధికారంలోనే ఉండాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడులో మూడవ రోజు ఆదివారం సాయంత్రం ఆయన ముగింపు సందేశం ఇచ్చారు.

టీడీపీ పాలనపై 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండాలని.. పార్టీ నేతలు, కార్యకర్తలు అవినీతి జోలికెళ్ల వద్దని సూచించారు. రాష్ట్రంలో గత ఏడాది 10.99 శాతం వృద్ధి నమోదైందని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని 15 శాతంగా నిర్ణయించామని చెప్పారు. పని చేసిన వారికే గుర్తింపు లభిస్తుందని మొన్న జరిగిన తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు నిరూపించాయన్నారు. అవినీతి పాలన, తప్పిదాల వల్లనే 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కనుమరుగైందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

 పేదరికం లేని సమాజమే ధ్యేయం
 పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఎన్టీఆర్ లక్ష్యమని, ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణాలో పార్టీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ఆదాయం లేకున్నా మొండి పట్టుదలతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివిధ పథకాలను ఉదహరించారు.

 తుని ఘటన ప్రతిపక్షాల కుట్ర
 తుని ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కులం, మతం పేరిట ప్రజలను విభజించి ప్రజలు, పెట్టుబడిదారుల్లో అభద్రతాభావం పెంపొందించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  మైనార్టీల కోసం కడప, విజయవాడలో హజ్‌హౌస్‌లను నిర్మిస్తున్నామన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ ఖనిజాన్ని టీడీపీయేతర ప్రభుత్వాలు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి యత్నిస్తే అనేక పోరాటాలు చేసి గిరిజన హక్కులను కాపాడామని చెప్పారు.  కాగా, మూడు రోజుల మహానాడులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 28 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

Advertisement
Advertisement