ఉద్యమంపై ఉక్కుపాదం! | Sakshi
Sakshi News home page

ఉద్యమంపై ఉక్కుపాదం!

Published Wed, Apr 19 2017 11:41 PM

ఉద్యమంపై ఉక్కుపాదం! - Sakshi

– నేడు కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
– సీఎం రాక నేపథ్యంలో అప్రమత్తమైన మంత్రి సునీత
– తన నివాసంలో ఐసీడీఎస్‌ అధికారులతో భేటీ
– యూనియన్‌ నేతలను పిలిపించి పరోక్ష హెచ్చరికలు?
– కార్యకర్తలను పంపొద్దంటూ సీడీపీఓలకు ఉన్నతాధికారుల ఆదేశాలు
– తీవ్ర ఒత్తిళ్లతో ధర్నా వాయిదా వేసుకున్న వైనం!

 
నెలల తరబడి జీతాల్లేవ్‌.. కేంద్రాలు నిర్వహిస్తున్న భవన యజమానులకు చెల్లించేందుకు అద్దెలూ రావడం లేదు.. టీఏ, డీఏల్లేవ్‌.. కూరగాయలు, వంట గ్యాస్‌ డబ్బులు సక్రమంగా అందడం లేదు.. అప్పు చేసి ఇంతకాలం సెంటర్లను నిర్వహించుకుంటూ వచ్చిన అంగన్‌వాడీలు ఇకపై తమవల్ల కాదంటూ ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20 (నేడు)న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాల్సిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మం‍త్రి పరిటాల సునీత.. అందుకు విరుద్ధంగా అంగన్‌వాడీల ఉద్యమంపై ఉక్కుపాద మోపారు. పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తూ బెదిరింపులకు దిగి ధర్నా వాయిదా వేసుకునేలా చేశారు.
- అనంతపురం టౌన్‌

జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 17 ప్రాజెక్టుల్లో 5,126 మెయిన్, మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటన్నింటిలో కలిసి 4,082 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రతి నెలా వీరికి జీతాల కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ నుంచి జీతాలు అందలేదు. సుమారు రూ.18 కోట్ల వరకు బకాయిలు అందాల్సి ఉంది. గర్భిణులు, చిన్నారుల ట్రాకింగ్‌ ఖర్చుల భారం మొత్తం అంగన్‌వాడీ కార్యకర్తలపైనే పడుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో పాటు హెల్పర్‌ లేని చోట వర్కర్లకు, వర్కర్‌ లేని చోట హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్లకు వేసవి సెలవులూ మంజూరు కావడం లేదు.

జిల్లా వ్యాప్తంగా సెంటర్‌ అద్దెలు, టీఏ, డీఏ, కూరగాయలు, గ్యాస్‌కు సంబంధించిన డబ్బులు కూడా అందకపోవడంతో సెంటర్ల నిర్వహణ భారంగా మారుతోంది. తాజాగా తీసుకొచ్చిన స్మార్ట్‌ ఫోన్‌ విధానం వల్ల కూడా సమస్యలు ఎదుర్కొంటున్నామన్నది అంగన్‌వాడీల వాదన. ఈ సమస్యలపై గతంలోనే ఐసీడీఎస్‌ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ అంగన్వాడీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 20న (నేడు) అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నిర్ణయించింది. ఈ విషయంపై ఈ నెల 17వ తేదీనే ఐసీడీఎస్‌ పీడీ జుబేదాబేగంకు సమాచారం కూడా ఇచ్చారు.

సీఎం పర్యటన నేపథ్యంలో..
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. పామిడి, అనంతపురంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో అప్రమత్తమైన మంత్రి సునీత బుధవారం నేరుగా రంగంలోకి దిగారు. ఐసీడీఎస్‌ పీడీ జుబేదాబేగం, అదనపు పీడీ ఉషాఫణికర్‌ను తన క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలోనే అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేస్తే తన పరువుపోతుందని గ్రహించిన మంత్రి.. తొలుత ఉపశమన చర్యలకు దిగారు. ఫలితంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను జిల్లా కేంద్రానికి రాకుండా చూసుకోవాలని  సీడీపీఓలకు ఐసీడీఎస్‌ అధికారులు ఫోన్లు చేసి హెచ్చరించారు.

అనంతరం నేరుగా మంత్రి నివాసానికే యూనియన్‌ నేతలను పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా ధర్నా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని వారికి మంత్రి సునీత సూచించారు. ఆ తర్వాత ఐసీడీఎస్‌ అధికారులు కూడా యూనియన్‌ నేతలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అంగన్‌వాడీలు ఆందోళన చేసిన నేపథ్యంలో ఉద్యోగాల్లోంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో సదరు యూనియన్‌ నేతలు ప్రాజెక్టుల్లోని నాయకులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఉన్న ఉద్యోగం ఊడితే తాము బజారున పడాల్సి వస్తుందని భావించి వారు కూడా సరేనన్నట్లు సమాచారం. అనంతరం మంత్రి నివాసం నుంచే రాష్ట్ర కమిటీ నేతల దృష్టికి కూడా ఇక్కడి పరిస్థితిని యూనియన్‌ జిల్లా కమిటీ నేతలు వివరించారు. చివరకు ఈనెల 24న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వాయిదా నిర్ణయాన్ని యూనియన్‌ నేతలు ధ్రువీకరించగా... 24న కూడా ఉద్యమించే పరిస్థితి కన్పించడం లేదు.

రోడ్డెక్కడం మంచిదికాదు : మంత్రి సునీత
చిన్న చిన్న సమస్యలకు అంగన్‌వాడీలు రోడ్డెక్కడం మంచిది కాదని మంత్రి సునీత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల సమస్యలు తీరవన్నారు. సమస్యల్ని తన దృష్టికి తెస్తే అధికారులు, ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించడానికి ఉత్తర్వులు ఇచ్చామని, చెల్లింపులు జరుగుతున్నట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement