రక్తదాత.. సుఖీభవ! | Sakshi
Sakshi News home page

రక్తదాత.. సుఖీభవ!

Published Tue, Jun 13 2017 10:10 PM

రక్తదాత.. సుఖీభవ! - Sakshi

సందర్భం : నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం  

అమూల్యమైన రక్తం రోగులకు అవసరమైన మేర లభించడం లేదు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రులకు వచ్చే వారిలో చాలా మంది రక్తం అందక మృత్యుఒడికి చేరిన సందర్భాలున్నాయి. అవసరమైన ప్రతిసారీ రక్తదానం చేసి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు పలువురు. మరికొందరు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ యువతలో చైతన్యం తెస్తున్నారు. సమాజ సేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. రక్తదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఐక్యరాజ్య సమితి సూచన మేరకు ప్రతి ఏటా జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- అనంతపురం మెడికల్‌

జిల్లాలో గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, రోగులకు, ఇతర ఆపరేషన్ల కోసం ఏటా 45 వేల యూనిట్ల వరకు రక్తం అవసరం.  ఇందులో కేవలం 25 వేల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. మానవతావాదులు స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు వస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.  

రక్త సేకరణ, నిల్వ ఇలా..
జిల్లాలో రక్త సేకరణకు అనంతపురం సర్వజనాస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రి, హిందూపురం ప్రభుత్వాస్పత్రి, బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రి, జేఎన్‌టీయూ వద్ద ఉన్న రెడ్‌క్రాస్, పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి. జిల్లా అనంతపురంలోని సర్వజనాస్పత్రితో పాటు కళ్యాణదుర్గం, తాడిపత్రి, మడకశిర, ధర్మవరం, గుంతకల్లు, గుత్తిలోని ప్రభుత్వాస్పత్రుల్లో రక్త నిల్వ కేంద్రాలున్నాయి.

ఫేస్‌బుక్, వాట్సప్‌ వేదికగా ‘రక్తదాతల గ్రూప్‌’
దేశానికి ఉపయోగపడని శరీరం, ధనం ఎంత పెరిగినా వృథా అన్న స్వామి వివేకానందుడి స్ఫూర్తితో అనంతపురంలోని రాంనగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌ (బీటెక్‌ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు), మూడో రోడ్డుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి (ఎస్కేయూలో పరిశోధక విద్యార్థి) కలిసి ‘స్వామి వివేకానంద రక్తదాతల సంస్థను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం వీరిద్దరూ ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌లో పాల్గొని ఏడు రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తామే ఓ సంస్థను ఏర్పాటు చేసి సాయం చేయాలని భావించి ‘రక్తదాతల సంస్థ’కు జీవం పోశారు.  ఫేస్‌బుక్, వాట్సప్‌ వేదికగా చేసుకుని రక్తదాతలను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమని సమాచారం అందినా తక్షణం సేవలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యి మందికి రక్తదానం చేయించారు. రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా భావించి తమ సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా రక్తదాతలను చేర్చుకోవడమే కాక విద్యాసంస్థల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ఈ తరం యువతకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

18 ఏళ్లుగా రక్తదానం
అనంతపురంలోని హౌసింగ్‌ బోర్డుకు చెందిన వాజిద్‌... చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇతని బ్లడ్‌గ్రూప్‌ ‘ఎ’ నెగిటివ్‌. ఈయన 18 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, గర్భిణులు, రక్తహీనతతో బాధపడుతున్న 51 మందికి ఇతను రక్తదానం చేశారు. రక్తదానం చేశాక బాధితుల కళ్లలో సంతోషం చూస్తే ఈ జన్మకు అది చాలన్నట్లు భావిస్తానని ‘వాజిద్‌’ తెలిపారు.

ఆపద సమాయాల్లో రక్త‘దానం’
అనంతపురంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దానం... తన రక్తాన్ని దానం చేయడానికి సదా ముందుంటారు.  ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణలో ఉంటూనే మరోవైపు సామాజిక సేవలో తరిస్తున్నారు. ఇప్పటి వరకు 25 సార్లు రక్తదానం చేశారు. ఈయనది ‘బి’ పాజిటివ్‌ బ్లడ్‌గ్రూప్‌.

ఒక్కడితో ప్రారంభమై.!
ఏదైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుందంటారు. దీన్ని నిజం చేశారు అనంతపురం నగర పాలక సంస్థలో మోటార్‌ మెకానిక్‌గా పని చేస్తున్న హనుమంతరెడ్డి. 1996 నుంచి ఇప్పటి వరకు 76 సార్లు రక్తదానం చేశారు. కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్‌  విభాగంలో 309 మంది కార్మికులు పని చేస్తుంటే అందులో 250 మంది రక్తదాతలే ఉన్నారు. వీరంతా హనుమంతరెడ్డి స్ఫూర్తితో రక్తదాతలుగా మారారు. ఈయన సురక్షత రక్తదాతల సంస్థ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 12 వేల మందికి ఉచితంగా రక్తాన్ని అందజేశారు.

అపోహలు తొలగించుకోండి
రక్తదానంపై ఉన్న అపోహలు అందరూ వీడాలి. పెద్దాస్పత్రికి రోజూ ఎంతో మంది వస్తుంటారు. కొంత మందికి రక్తం అందించలేని పరిస్థితి. కొందరు యువకులకు ఫోన్‌ చేయగానే వచ్చి ఇస్తున్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకురావాలి. ఇన్నాళ్లూ విద్యాసంస్థలకు సెలవులు కావడంతో శిబిరాలు ఏర్పాటు చేయలేకపోయారు. ఇక నుంచి శిబిరాలు ఏర్పాటు చేస్తాం.
– డాక్టర్‌ శివకుమార్, బ్లడ్‌బ్యాంక్‌ ఇన్‌చార్జ్, సర్వజనాస్పత్రి

ఏ సమయంలోనైనా ఫోన్‌ చేయండి
యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకురావాలి. సంజీవిని సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైతే తక్షణం ఫోన్‌ (9440476651) చేయండి.
– రమణారెడ్డి, సంజీవిని స్వచ్ఛంద సంస్థ, అనంతపురం

Advertisement
Advertisement