శ్రియ మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం | Sakshi
Sakshi News home page

శ్రియ మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం

Published Fri, Mar 4 2016 8:55 AM

శ్రియ మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం - Sakshi

జవహర్‌నగర్: విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదివే హైదరాబాద్ విద్యార్థిని టీఎన్‌ఆర్ శ్రియ(20) ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని తీసి భద్రపర్చాలని కోర్టు సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్ అమ్ముగూడ బెర్నార్డ్ సెమెట్రీ శ్మశానవాటికలో ఖననం చేసిన శ్రియ మృతదేహాన్ని  శుక్రవారం మల్కాజిగిరి తహసీల్దార్ విజయ సమక్షంలో పోలీసులు వెలికి తీయనున్నారు. అనంతరం కోర్టు ఉత్తర్వుల మేరకు మృతదేహానికి ఫోరెన్సిక్ అధికారులు రీపోస్టుమార్టం నిర్వహిం చనున్నారు.
 
ఆత్మహత్యగా చిత్రీకరించారు: శ్రియ కుటుంబీకులు
శ్రియ గత నెల 12న సాయంత్రం కాలేజీలో తన చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఆమె కుటుంబీకులు అనుమానానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుంచి ఐఏఎస్ కావాలనే తపనతో చదివేదని, ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 1  నుంచి 2 గంటల మధ్యలో చాలా ఆనందంగా తల్లితో మాట్లాడిందని కుటుంబీకులు తెలిపారు. గీతం కళాశాలలో ఏదో జరిగిందని 12వ తేదీన సాయంత్రం 5.23 గంటలకు బెంగుళూరులోని తన స్నేహితురాలితో చాటింగ్ చేయగా పోలీసులు మాత్రం సాయంత్రం 5 గంటలకే శ్రియ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

కుటుంబసభ్యులను విచారించకుండానే అక్కడి పోలీసులు కళాశాల యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా శ్రియ మృతిపై ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని ఆమె తల్లిదండ్రులు యవన్, ప్రసాద్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement