అధికారగణం రెడీ | Sakshi
Sakshi News home page

అధికారగణం రెడీ

Published Thu, Aug 11 2016 12:45 AM

విద్యుద్దీపాల వెలుగుల్లో పెబ్బేరు మండలంలోని రాంపూర్‌ఘాట్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌:  పుష్కర మహోత్సవానికి మరొక్క రోజే మిగిలి ఉంది. అధికారయంత్రాంగం సర్వం సిద్ధమవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ ఉండకుండా చూసేందుకు ఒక్కో ఘాట్‌కు వంద మంది నుంచి 3వేల మంది సిబ్బంది (ఘాట్‌స్థాయిని బట్టి) దాకా నియమించారు. ఇందులో ప్రతిశాఖనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాఖల వారీగా విధులను కేటాయించారు. మొత్తం 52 ఘాట్లు ఉండగా నీటిలో మునిగిపోవడంతో ధరూర్‌ మండలంలోని రేవులపల్లి ఘాట్‌ను తొలగించారు. మిగతా 51 ఘాట్లలో 23,341 మంది సిబ్బందిని కేటాయించారు.  
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా వస్తున్న కష్ణా పుష్కరాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించేందుకు ఏ ర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ప్రారం భం కానున్న పుష్కరాలకు జిల్లా ముస్తాబైంది. ట్రాఫిక్‌ నియంత్రణ, వీఐపీ ప్రొటోకాల్, దారి వెంబడి సైన్‌ బోర్డులు, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, బారికేడ్లు, పార్కింగ్‌ స్థలాలు, గజ ఈతగాళ్లు, విపత్తు నివారణ వంటి వాటిపై అధికారులు దష్టి కేంద్రీకరించారు. ఎలాంటి అవాంతరాలూ లేకుండా కష్ణా పుష్కరాలు యాత్రికులకు మంచి అనుభవాన్ని మిగిల్చేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. గోదావరి పుష్కరాల అనుభవాలను దష్టిలో ఉంచుకుని కష్ణా పుష్కరాల్లో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దాదాపు 2.5కోట్ల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పుష్కరఘాట్లలో తగిన ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సేవలందించేందుకు 23,341మందికి ఆయా ఘాట్ల వారీగా విధులు కేటాయించారు. అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా అధికారులు పుష్కరవిధుల్లో పాల్గొననున్నారు. విపత్తు నివారణ, గజ ఈతగాళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. విపత్తు నివారణ సిబ్బంది 40మందిని ప్రభుత్వం కేటాయించింది.  పుష్కరాలను వైభవంగా నిర్వహించే బాధ్యతలను కలెక్టర్‌ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులకు అప్పగించారు. 

Advertisement
Advertisement