రేపటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు

Published Wed, Jul 27 2016 12:46 AM

రేపటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు - Sakshi

సాక్షి,విశాఖపట్నం: విశాఖ మన్యంలో మరో పెద్ద పండుగ రేపటి నుంచి మొదలవుతోంది. అయితే ఇది సాధారణంగా జరిగే పండుగ కాదు మావోయిస్టుల ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చేందుకు..గడిచిన ఏడాదిలో ఊపిరి ఆగిన అమర వీరులకు నివాళులర్పించేందుకు జరుపుకునే పండుగ. ఇటు పోలీసులకు ఇన్నాళ్లు ఎక్కడో దండకారణ్యంలో ఉంటున్న అన్నలు జనారణ్యంలోకి వస్తే వారిని పట్టుకోవడానికి, వారికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టడానికి దొరికిన సదవకాశం. అయితే ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల మధ్య ప్రజాప్రతినిధులు మాత్రం వారోత్సవాలు జరిగినన్ని రోజులు కంటి మీద కునుకు లేకుండా గడపక తప్పదు.
lచార్‌మజుందార్‌ వర్దంతి సందర్భంగా ప్రతి ఏటా మావోయిస్టులు  పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఎ) వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏడాది కాలంలో అమరులైన వారికి స్థూపాలు నిర్మించి నివాళులర్పిస్తారు. అయితే ఈ ఏడాది కొత్తగా  వారోత్సవాలకు ముందే మావోయిస్టులు ఈ పని మొదలుపెట్టారు. ఈనెల 28 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆగష్టు 3వ తేదీ వరకూ జరుగనున్నాయి. కానీ ఇప్పటికే మన్యంలో స్ధూపాలు నిర్మించి,నివాళులర్పించే కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. దీంతో వారోత్సవాలను విఫలం చేసేందుకు ఇటు పోలీసులు సైతం రంగం సిద్దం చేశారు. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వరుస సంఘటనలతో  సహచర కామ్రెడ్లను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకార దాడులకోసం..వారు బయటకు వస్తే తమ పని సులువు అవుతుందని పోలీసులు అదును కోసం ఎదురు చూస్తున్నారు. 
మారిన వ్యూహం:
విశాఖ మన్యంలో మావోయిస్టులు ప్రణాళికాబద్ధంగా కదులుతున్నారు. దాదాపుగా ఇక లేదనుకున్న ఉద్యమానికి ఊపిరిపోసేందుకు శ్రీకారం చుట్టి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు మావోల వ్యూహాలకు గండి కొడుతున్నారు. గిరిజనులే ఎదురు తిరిగి ఇద్దరు దళ సభ్యులను బలపం పంచాయతీలో గతేడాది హతమార్చే పరిస్థితి వచ్చింది. దీంతో మావోయిస్టులు ఆచితూచీ వ్యవహరించడం ప్రారంభించారు. కానీ కుడుముల రవి, అజాద్, కమల వంటి అగ్రనేతలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో పీఎల్‌జీఏ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఉద్యమ బాట పట్టేలా విస్తత ప్రచారం చేయాలని భావిస్తున్నారు. 
సిద్ధమవుతున్న పోలీసు యంత్రాంగం:
మావోయిస్టులు పీఎల్‌జిఎ వారోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఇటు పోలీసు యంత్రాంగం కూడా అన్ని రకాలుగా సిద్ధమవుతుతోంది. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. చింతపల్లి,గూడెం కొత్తవీధి మండలాల్లో పోలీస్‌ స్టేషన్లను  కొద్దిరోజుల క్రితం ప్రారంభించారు. పోలీసులకు కూడా సౌకర్యాలు పెంచుతున్నారు. జి.మాడుగులలో పోలీస్‌ సిబ్బందికి బ్యారెక్స్‌ కల్పించారు. అదనపు బలగాలను మన్యంలో కూంబింగ్‌కు రప్పిస్తున్నారు.
 

Advertisement
Advertisement