పర్యాటకాన్ని ప్రైవేటుపరం చేయోద్దు | Sakshi
Sakshi News home page

పర్యాటకాన్ని ప్రైవేటుపరం చేయోద్దు

Published Wed, Oct 19 2016 7:04 PM

tourism can not to privatisation, says citu

హైదరాబాద్: ప్రభుత్వ బడ్జెట్‌తో అభివృద్ధి చేసిన పర్యాటక కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎ.గఫూర్, ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎక్కువ మందికి ఉపాధి లభించాలన్నా, సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా పర్యాటక రంగం ప్రభుత్వరంగంలో ఉండడమే ఉత్తమమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలతో ఇక్కట్లు పడుతూ కూడా ఉద్యోగులు టూరిజం కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఆధీనంలో 39 ప్రాజెక్టులు, 3 వేసైడ్ (దారిపక్క) వసతిగృహాలను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు.

వచ్చే ఐదేళ్ల కాలానికి వర్తించే ఏపీ టూరిజం పాలసీని హడావిడిగా ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కనీసం కేబినెట్‌ భేటీలో కూడా చర్చించకుండా ఈమేరకు 15వ నెంబర్ జీవోను జారీ చేసిందని వివరించారు. అమరావతి, విశాఖ, తిరుపతి, రాజమండ్రిలో సిటీ టూరిజం కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నదని, ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన ఆస్తులను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెడితే తీవ్ర అనర్థాలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పరం చేయాలనుకుంటున్న వాటిలో భవానీ ఐలాండ్, దిండి, కాకినాడ, బరంపార్క్ ఉన్నాయని, ఒకప్పుడు ఈ విషయాన్ని వ్యతిరేకించిన సీం చంద్రబాడు నాయుడు స్వయంగా తానే తిరిగి వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడడం అన్యాయమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement