రైళ్లు ఫుల్‌! | Sakshi
Sakshi News home page

రైళ్లు ఫుల్‌!

Published Sun, Jan 1 2017 10:24 PM

రైళ్లు ఫుల్‌!

సంక్రాంత్రి ఎఫెక్ట్‌
– జనవరి 20వరకు బోగీలన్నీ కిటకిట
– ప్రత్యేక రైళ్లు నిల్‌
– బస్‌ చార్జీల పెరుగుదలతో రైలుబండిని ఆశ్రయిస్తున్న జనం
 
కర్నూలు(రాజ్‌విహార్‌): సంక్రాంతి పండగ నేపథ్యంలో ముందస్తుగానే ప్రయాణానికి రిజర్వేషన్‌ చేయించుకోవడంతో రైళ్లలో చోటు దొరకడం లేదు.   ప్రస్తుతం నడుస్తున్న వాటిలో బెర్తులన్నీ నిండిపోయాయి.  టికెట్ల కోసం క్యూలో నిలిచిన ప్రయాణికులకు వెయిటింగ్‌ లిస్టు, నో రూమ్‌ సమాచారం దర్శనమిస్తోంది. జనవరి 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు సంకాంత్రి రద్దీని దృష్టిలో పెట్టుకుని పత్యేక రైళ్లను నడపకపోవడంతో పండుగ సంబరాలు అయినవారితో జరుపుకునే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. సంపన్నులు సొంత కార్లు, వాహనాలు, లేకుంటే ట్యాక్సీలు అద్దెకు తీసుకుని వెళ్తారు. అదే పేద, సామన్య ప్రజలకు అంత స్థోమత లేదు. దీంతో కొందరు ప్రయాణానికి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  
 
బస్సు చార్జీలు పెరగడంతోనే..
 సమీప పట్టణాలకు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉన్నా కుటుంబ సభ్యులతో దూర ప్రాంతాలకు వెళ్లే  వారికి ప్రయాణం ఓ పరీక్షగా మారింది. దసరా తరువాత పెరిగిన బస్సు చార్జీలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో రైలు చార్జీ తక్కువగా ఉన్న కారణంగా సామాన్యులు వాటిని ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా హైదరాబాదుకు బస్సు చార్జీలతో పోల్చితే ఎక్స్‌ప్రెస్‌ రైలులో 50శాతం చార్జీలోపే వెళ్లి రావచ్చు. ఇక ప్యాసింజరు రైలులో అతితక్కువగా రూ.40కే హైదరాబాదుకు చేరవచ్చు.
 
నిల్చునేందుకు జాగా కరువే!
రద్దీ సమయాల్లో ప్రయాణికుల అవసరాలు గుర్తించి ప్రత్యేక రైళ్లు నడపడంలో ఆశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తిరిగే రైళ్లలో కనీసం నిలబడేందుకు కూడా చోటు ఉండదని టీసీలే పేర్కొంటున్నారు. కర్నూలు మీదుగా హైదరాబాద్‌ వైపు ముఖ్యంగా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అర్ధరాత్రి తరువాత బయలుదేరుతాయి. గుంటూరు, కర్నూలు సిటీ, గుంతకల్లు ప్యాసింజర్‌ రైళ్లు పగలు నడుస్తున్నాయి. కొంగు ఎక్స్‌ప్రెస్, వైనగంగ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ఓఖా ఎక్స్‌ప్రెస్, జైపూర్‌ ఎక్స్‌ప్రెస్, అమరావతి ఎక్స్‌ప్రెస్‌ తదిరత రైళ్లు వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే నడుస్తున్నాయి. కర్నూలు నుంచే బయలుదేరే హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ (ఇంటర్‌ సిటీ) ఉదయం 05–30కి, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి వెళ్తాయి. హైదరాబాదు నుంచి కర్నూలు మీదుగా డోన్, తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్లు గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, మైసూర్‌ ఎక్స్‌ప్రెస్, వైనగంగ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం, ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్, కొంగు ఎక్స్‌ప్రెస్‌ వారంలో ఒకటి రెండు సార్లు, చెన్నై ఎగ్మోర్, తిరుపతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రోజువారీగా నడుస్తున్నాయి. గుంటూరు, గుంతకల్లు, కర్నూలు ప్యాసింజరు రైళ్లు సాధారణంగా తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు నడుస్తున్న రైళ్లలో నెల క్రితమే బెర్తులన్నీ రిజర్వేషన్ల ద్వారా పూర్తయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. బెర్తుల కోసం రిజర్వేషన్‌ చేయించుకునే ప్రయాణికులకు వందల్లో వెయిటింగ్‌ లిస్టు దర్శనమిస్తోంది. సాధారణ కంపార్ట్‌మెట్ల బోగీలు (జనరల్‌) కేవలం రెండు మూడు మాత్రమే పెడుతుండడంతో వీటిలో కూర్చునే సీటు సంగతి ఎలా ఉన్నా కనీసం నిల్చునేందుకు కూడా జాగా ఉండదని టీసీలు అంటున్నారు. రద్దీ సమయాల్లో ప్రయాణికుల అవసరాలు గుర్తించి ప్రత్యేక రైళ్లు నడపని రైల్వే అధికారులపై జనం మండిపడుతున్నారు.

Advertisement
Advertisement