Sakshi News home page

వెలుగుల శాఖలో బదిలీల పర్వం

Published Sun, May 28 2017 1:26 AM

TRANSFFERS IN EPDCL

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఆ సంస్థలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేయాలని మార్గదర్శకాలు అందాయి. బదిలీకి అర్హులైన వారి జాబితాను ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి సిద్ధం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను బదిలీల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో రెండేళ్ల పదవీ కాలం పూర్తిచేసిన వారిని పట్టణ ప్రాంతాలకు బదిలీ చేస్తారు.
 
అర్హుల జాబితా విడుదల
క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి ఇంజినీరింగ్‌ అధికారుల వరకు మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు, 3నుంచి ఐదేళ్లుగా ఒకేచోట పని చేస్తున్న వారు, ఐదేళ్లుగా ఒకేచోట ఉన్న వారి జాబితాలను వేర్వేరుగా రూపొందించారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఏరియాల వారీగా వివిధ స్థాయిల్లో జాబితాలను సిద్ధం చేశారు. ఈ జాబితాలపై రెండు రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించిన తరువాత అర్హుల జాబితా విడుదల చేస్తారు. తరువాత ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌లో సంబంధిత ఉద్యోగులు తమకు కావాలి్సన ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు. వెబ్‌ ఆప్షన్లకు వచ్చేనెల  4వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. బదిలీ పొందిన వారంతా వచ్చేనెల 22వ తేదీలోగా పాత స్థానాలను వదిలి కొత్త స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. ఇదిలావుంటే ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకుల బదిలీలపై సస్పెన్స్‌ వీడలేదు. కీలకంగా పనిచేస్తున్న మూడు గుర్తింపు సంఘాల వారికి మాత్రమే బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాల కోసం వివిధ సంఘాల నేతలు ఎదురుచూస్తున్నారు. 
 
ఉద్యోగుల వారీగా..
సాధారణ బదిలీల్లో ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో ఎస్‌ఈ వివిధ స్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తారు. అకౌంట్స్‌ విభాగంలో జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్‌లను బదిలీ చేస్తారు. ఇంజినీరింగ్‌ విభాగంలో సబ్‌ ఇంజినీర్లను, ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ విభాగంలో ఫోర్‌మెన్, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయవచ్చు. కాగా బదిలీ మార్గదర్శకాల మేరకు తయారు చేసిన జాబితాలో 8 మంది జేఏఓలు, 31 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 38 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, 18 మంది సబ్‌ ఇంజినీర్లు, ముగ్గురు ఫోర్‌మెన్లు ఉన్నారు. వీరిలో సీనియార్టీ ప్రకారం వారు కోరుకున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement