ఒకే కాన్పులో ముగ్గురు జననం | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు జననం

Published Sat, Jun 10 2017 11:48 PM

ఒకే కాన్పులో ముగ్గురు జననం

కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ): ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు ఓ మాతృమూర్తి జన్మనిచ్చిన అరుదైన సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. ముగ్గురు నవజాత శిశువులతోపాటు తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ప్రసవానికి సంబంధించిన వివరాలను శనివారం కాకినాడ గాంధీనగర్‌లో శ్రీలాస్య ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం.రాధిక తెలిపారు. కాకినాడ డైరీఫారం సెంటర్‌కు చెందిన సూదికొండ వీరవెంకటరమణ, గంగాభవానీలు భార్యా భర్తలు. వీరికి సుమారు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఏడాది క్రితం జరిగిన తొలి కాన్పులో పుట్టిన మరక్షణమే పసిబిడ్డ మృతి చెందింది. మళ్లీ రెండోసారి గర్భం దాల్చడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం కాకినాడ శ్రీలాస్య  ప్రైయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన గంగాభవానీకి ప్రసవ నొప్పులు రావడంతో శస్త్ర చికిత్స చేసి ముగ్గురు బిడ్డలను సురక్షితంగా బయటకు తీశారు. ఇందులో ఒక పాప (1.5) కడుపులో అడ్డం తిరగడం, ఇద్దరు బాలురు (చెరో 1.700 గ్రాముల బరువు)తో పుట్టారు. వీరిలో ఓ బాబు ఎదురుకాళ్లతో ఉండటంతో సాధారణ ప్రసవం జరిగేందుకు ఆస్కారం లేకపోవడంతో సిజేరియన్‌ చేసినట్లు శ్రీలాస్య ఆసుపత్రి ఎండీ, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రాధిక తెలిపారు. ఒకే కాన్సులో ముగ్గురు జన్మించడం అరుదైన సంఘటనని అన్నారు. ప్రతి అయిదారు వేల కేసుల్లో ఒక్కో కేసు ఇలా అరుదుగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో పిడీయాట్రిక్‌ డాక్టర్‌ అంగర రవి, డాక్టర్‌ సిద్ధార్థ కిరణ్, ఎనస్తీషియా డాక్టర్‌ ఎస్‌వీ లక్ష్మీనారాయణలు పాల్గొన్నట్లు తెలిపారు.  
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement