టీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీ వివాదం | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీ వివాదం

Published Fri, Aug 26 2016 11:50 PM

భద్రాచలంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం

 

  • కొత్తజిల్లా సంబురాల్లో ఇరు వర్గాల పోరు
  • ఇరువురిపై కేసు నమోదు


భద్రాచలం : కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంగా భద్రాచలంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద జరిగిన సంబురాల్లో వివాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం, సీఎం కేసీఆర్‌  ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, సంబురాలు చేసుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన రమాకాంత్, రజనీకాంత్‌ అనే ఇరువురు  ఫ్లెక్సీలను తొలగించి, చించివేశారని జలగం వర్గానికి చెందిన దూడల దయామూర్తి, బొంబోతుల రాజీవ్‌లు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రజనీకాంత్, రమాకాంత్‌ మంత్రి తుమ్మల వర్గంగా కొనసాగుతున్నారు. దీంతో భద్రాచలంలో మొదటి నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్న జలగం, తుమ్మల వర్గీయుల మధ్య వివాదం రాజుకుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే జలగం వెంకట్రావు నాయకత్వమే సాగుతుందనే ధీమాతో అతని వర్గీయులు వేరుగా కార్యక్రమాలను చేస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్దనే ఇలా ఇరు వర్గాల మధ్య జగడం చోటుచేసుకోవటం, అది కాస్తా పోలీసు స్టేషన్‌ వరకూ వెళ్లటం ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ మానె రామకృష్ణ రాజీ ప్రయత్నాలు చేసినప్పటకీ ప్రయోజనం లేకుండా పోయింది. నాయకులు, కార్యకర్తలందరి ముందు జలగం, సీఎం  ఫ్లెక్సీలను చించి వేసినందున తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఫిర్యాదు దారులు పట్టుదలతో ఉన్నారు. అయితే తాము  ఫ్లెక్సీలను చించలేదని, కావాలనే ఇలా తమపై బురద జల్లుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పట్టణ ఎస్సై కరుణాకర్‌ తెలిపారు. కొత్త జిల్లాలో ఆధిపత్యం కోసమని అప్పుడే వర్గాల పోరు మొదలు కావటంతో ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోనని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement