రెండు పడవలపై ప్రయాణం | Sakshi
Sakshi News home page

రెండు పడవలపై ప్రయాణం

Published Fri, Aug 5 2016 11:37 PM

two boats journy

  • రాజకీయ పార్టీ ఒకటి.. కార్మిక సంఘం మరొకటి
  • సింగరేణిలో సంఘాల ముఖ్య నేతల తీరు
  • అయోమయంలో ద్వితీయ శ్రేణి క్యాడర్‌
  •  
    గోదావరిఖని(కరీంనగర్‌) : సింగరేణిలో పలు యూనియన్లకు సారథ్యం వహిస్తున్న నేతలు రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు. రాజకీయ పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీకి అనుబంధ యూనియన్‌లో కాకుండా మరో యూనియన్‌ కు నాయకత్వం వహిస్తున్నారు. ఇలా ముఖ్య నేతలు వ్యవహరిస్తుండడం ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు క్యాడర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఒకసారి నేతల తీరు పరిశీలిస్తే.. 
    సింగరేణిలో ఒక పర్యాయం గుర్తింపు సంఘంగా వ్యవహరించిన ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌(ఎస్‌సీఎంఎల్‌యూ)కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బి.వెంకట్రావు ఉన్నారు. యూనియన్‌ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలోనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఓ వైపు టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతూనే మరోవైపు ఎస్‌సీఎంఎల్‌యూకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా జనక్‌ప్రసాద్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింగరేణి కాలరీస్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్, వెంకట్రావు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎస్‌సీఎంఎల్‌యూ కలిసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంకట్రావు తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరగ్గా.. ఆయన దానిని ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీని వీడను అని ప్రకటించారు. ఇక మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి టీఆర్‌ఎస్‌ పార్టీలోనే పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆయన సింగరేణిలో హెచ్‌ఎంఎస్‌కు అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సింగరేణిలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా టీబీజీకేఎస్‌ ఉండగా వేణుగోపాలచారి కార్మిక క్షేత్రంలో పర్యటిస్తూ హెచ్‌ఎంఎస్‌ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్న నాయిని నర్సింహారెడ్డి మరోవైపు హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా సింగరేణిలో పర్యటించిన సమయంలో హెచ్‌ఎంఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతూ రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో పార్టీ అనుబంధ యూనియన్‌కు వ్యతిరేకంగా.. మరో యూనియన్‌కు అనుకూలంగా ప్రచారం ఎలా చేస్తారనేదే ప్రశ్నార్థకం గా మారింది. ఒకవేళ పార్టీ అనుబంధ యూనియన్‌కు కాకుండా మరో యూనియన్‌ గెలుపుకోసం ప్రచారం చేసినట్లయితే పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుందనే చర్చ కార్మిక వర్గంలో జరుగుతోంది. అయితే ఇలాంటి నేతల వైఖరి కారణంగా ఆయా యూనియన్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎటూ తేల్చుకోలేని స్థితికి చేరింది.
     
     

Advertisement
Advertisement