Sakshi News home page

యమపాశమైన విద్యుత్‌ తీగలు

Published Fri, Sep 30 2016 10:04 PM

యమపాశమైన విద్యుత్‌ తీగలు - Sakshi

– ఒకే గ్రామంలో వేర్వేరు 
ఘటనల్లో ఇద్దరి దుర్మరణం 
– విద్యుత్‌ శాఖ 
 నిర్లక్ష్యమేనని గ్రామస్తుల ఆగ్రహం 
గుడివాడ: 
విద్యుత్‌ షాక్‌తో మండలంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం ఒకేరోజు ఒకే గ్రామంలో ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. వివరాల్లోకెళ్తే... గుడివాడ మండలం శేరీదింటకుర్రు గ్రామానికి చెందిన వడ్లమూడి సురేష్‌ (45) ఉదయం నుంచి గ్రామంలో విద్యుత్‌ లేకపోవడంతో ట్రాన్స్‌ఫారం వద్దకు వెళ్లి ఫీజులను చూస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వ్యవసాయ కూలీ అయిన ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్‌ మృతితో భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
 
కాలువలో దిగి... షాక్‌తో మృతి
 అదే గ్రామానికి చెందిన తోట భూ లక్ష్మి (60) పొలానికి వెళ్లివస్తూ కాల్వలోకి దిగి కాళ్లు కడుక్కుంటున్న సమయంలో విద్యుత్‌ వైరు తెగి కాల్వలో పడటంతో షాక్‌ గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. భూలక్ష్మికి భర్త వేణుగోపాలరావు, కుమారుడు ఉన్నారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తూర్పుకృష్ణా డెల్టా కమిటీ చైర్మన్‌ గుత్తా శివరామకృష్ణ (చంటి) తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. 
 
విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే: గ్రామస్తులు 
గ్రామంలో దుర్ఘటనలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌ సమస్యలపై పదేపదే ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, దీనివల్లే రెండు నిండు ప్రాణాలు బలైనట్లు ఆరోపించారు. గ్రామంలో తరచూ కరెంటు కట్‌ అవుతోందని, సిబ్బంది ఇటువైపు కన్నెత్తి చూడ్డం లేదని అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 
 
 

Advertisement
Advertisement