హైదరాబాద్ శివార్లలో రెండు రైల్వే జంక్షన్లు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ శివార్లలో రెండు రైల్వే జంక్షన్లు

Published Sat, Dec 5 2015 12:41 AM

హైదరాబాద్ శివార్లలో రెండు రైల్వే జంక్షన్లు - Sakshi

 ఏర్పాటు చేయాలని రైల్వే శాఖకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
♦ చర్లపల్లి, నాగులపల్లిలో జంక్షన్లను అభివృద్ధి చేయాలి
♦ ఢిల్లీ, చెన్నై, ముంబై మార్గాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి
♦ పేదల కోసం సికింద్రాబాద్‌లోని రైల్వే భూములు ఇవ్వండి
♦ రైల్వేకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామని హామీ
♦ ముఖ్యమంత్రితో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా భేటీ
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైల్వే శాఖను కోరారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లపై ఒత్తిడి విపరీతంగా పెరిగినందున కొత్త జంక్షన్లు అవసరమని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని... దీనికి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయం లో సీఎం కేసీఆర్‌తో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ, చెన్నై తదితర మార్గాలకు చర్లపల్లి జంక్షన్... ముంబై మార్గానికి నాగులపల్లి జంక్షన్ అనుకూలంగా ఉంటాయని రవీంద్ర గుప్తాకు సీఎం కేసీఆర్ చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో మరింత ఉపయోగకరంగా ఉంటుం దన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రవీంద్ర గుప్తా.. దీనిపై రైల్వే శాఖకు ప్రతిపాదనలను పంపుతామని చెప్పారు. చర్లపల్లిలో ఇప్పటికే రైల్వే శాఖకు కొంత భూమి ఉందని, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత భూమిని కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పేదల గృహ నిర్మాణానికి, ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల ఏర్పాటుకు స్థలం లేదని... రైల్వే శాఖకు ఉన్న భూమిలో 15 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించాలని కోరారు. దానికి బదులుగా మరో చోట రైల్వే శాఖకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీనికి కూడా జీఎం రవీంద్ర గుప్తా సానుకూలంగా స్పందించారు.

 క్రాసింగ్‌లకు గేట్లు పెట్టండి..
 రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 చోట్ల కాపలాదారులు, గేట్లు లేని లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే జీఎంతో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత ఏడాది మాసాయిపేట దుర్ఘటనలో పిల్లలు మరణించడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని... అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే గేట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశాన్ని ప్రథమ ప్రాధాన్య అంశంగా గుర్తించి, దశల వారీగా గేట్లు ఏర్పాటు చేస్తామని జీఎం పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లోని తుకారం గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులను త్వరగా చేపట్టాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో మంత్రి పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement