Sakshi News home page

ఆ రెండూళ్లు ఇక ఉండవు

Published Sun, Jul 24 2016 9:32 AM

స్టార్టప్ ఏరియా నమూనా చిత్రం. (రెడ్ మార్క్ చేసిన చోట ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలు ఉన్నాయి.) - Sakshi

సాక్షి, అమరావతి: తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని నిర్మాణాన్ని గుంటూరు జిల్లా  మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 29 గ్రామాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ సమీకరణ పేరుతో 22వేల మంది రైతుల నుంచి ఇప్పటికే 33వేల ఎకరాలను లాక్కుంది.

అమరావతి సీడ్ కేపిటల్‌లో స్టార్టప్ అభివృద్ధి చేసేందుకు తుళ్లూరు మండల పరిధిలోని 1,691 ఎకరాలను మూడు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించి నమూనాను సీఆర్‌డీఏ ఇటీవల విడుదలచేసింది. ఈ 1,691 ఎకరాలను పూర్తిగా చదునుచేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలి. అందులో ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాలు 45 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.

రెండు గ్రామాల్లో మొత్తం జనాభా 3,057 కాగా, 792 నివాసాల్లో 850 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంకా 6 హిందూ దేవాలయాలు, 7 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటినీ కూల్చేసి, చదునుచేసి ఏడీపీ, జీవీసీ,సీసీడీఎంసీఎల్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో రాజధానిని ప్రకటించటంతో గ్రామస్తులు కొందరు పాత నివాసాలను పడగొట్టి రూ.లక్షల రూపాయలు వెచ్చించి కొత్త భవనాలను నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు తమ రెండు గ్రామాలను స్టార్టప్ ఏరియాలో చేర్చారని తెలుసుకున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement