ఉద్యానశాఖలో నూతనోత్సాహం | Sakshi
Sakshi News home page

ఉద్యానశాఖలో నూతనోత్సాహం

Published Thu, Jun 1 2017 12:09 AM

ఉద్యానశాఖలో నూతనోత్సాహం - Sakshi

జంగారెడ్డిగూడెం : 2017–18 సంవత్సరానికి గాను జిల్లాలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ రూ.42.86 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గత ఏడాది రూ.32.28 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.25.86 కోట్లు మాత్రమే వెచ్చించారు. దీనికి కారణం పామాయిల్‌ పంటను ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించినా పంట ధర సరిగా లేకపోవడంతో రైతులు ముందుకు రాలేదు. దీంతో నిధులు మిగిలిపోయాయి. కానీ ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉద్యాన పంటల సాగు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రణాళిక, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, జాతీయ పామాయిల్‌ అభివృద్ధి సంస్థ తదితర పథకాల నుంచి రూ.42.86 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. 
పంటల విస్తీర్ణం పెంపు లక్ష్యం 
రానున్న 3ఐదేళ్లలో 0.62 లక్షల హెక్టార్ల నుంచి 0.80 లక్షల హెక్టార్లకు పామాయిల్‌ విస్తీర్ణం పెంచాలని లక్ష్యం. ఇరవై వేల హెక్టార్లలో కోకో పంటను పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతరపంటగా పెంచేందుకు నిర్ణయించారు. అధిక పోషక విలువలు కలిగిన కూరగాయలు, పూలతోటలు పెంపకాన్ని ప్రోత్సహించడం లక్ష్యం. దీనికి గాను రైతులకు వివిధ పథకాల కింద సబ్సిడీపై పాలీ హౌస్‌లు, గ్రీన్‌ హౌస్‌లు, యంత్ర పరికరాలు, ఫారమ్‌ఫాండ్స్‌ అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,43,328 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలు రైతులు పండిస్తున్నారు. ఈ ఏడాది మరో 15 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు విస్తరించాలని అధికారులు నిర్దేశించుకున్నారు. వక్క, మిరియం, గుమ్మడి, మునగ, నిమ్మగడ్డి, పూల తోటల్లో అధికంగా చామంతి, గులాబీ తదితర వాటిని అధిక విస్తీర్ణంలో పెంచే విధంగా రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్యాన శాఖ నిర్ణయం తీసుకుంది.  
 

Advertisement
Advertisement