గోచార ఫలితాలను చూసి బెంబేలెత్తిపోకండి | Sakshi
Sakshi News home page

గోచార ఫలితాలను చూసి బెంబేలెత్తిపోకండి

Published Wed, Mar 29 2017 12:09 AM

గోచార ఫలితాలను చూసి బెంబేలెత్తిపోకండి

– పీఠం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగపఠనం
– ప్రముఖులకు సత్కారాలు
రాజమహేంద్రవరం కల్చరల్‌ : నూతన వత్సరాది పంచాంగాల్లో గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాè, ప్రజలు బెంబేలెత్తిపోవలసిన అవసరం లేదని శ్రీమహాలక్ష్మీసమేత చిన్న వేంకన్నస్వామి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు అన్నారు. పీఠం ఆధ్వర్యంలో బుధవారం శ్రీనివాసనగర్‌ శాఖా కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగపఠనం నిర్వహించారు. ఒకే రాశికి చెందినవారు లక్షలాది మంది ఉంటారని, అందరి జాతక ఫలితాలు ఒకే తీరున ఉంటాయని అనలేమన్నారు. వ్యక్తి జాతకాన్ని, దశ, అంతర్దశలను పరిశీలించిన తరువాత మాత్రమే ఫలితాలను అంచనావేయగలుగుతామన్నారు. పంచాంగంలోని అంశాలు మనలను బాధపెట్టడానికి కాదు, మన భాద్యతలను పెంచడానికేనని ఆయన అన్నారు.  ఉగాది తేదీలలో, ఉగాది వత్సరం పేర్లలో ఉన్న వివాదాలగురించి తాముఎవరి నమ్మకాన్ని కాదనడంలేదని, తమ సిద్ధాంతాలకు ఆధారాలు మాత్రమే చూపుతున్నామని అన్నారు. మధుర కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ గోచారఫలితాలలో అవమానం ఎక్కువ, రాజపూజ్యం తక్కువ ఉంటే, జాతకుడు మౌనం పాటించి వివాదాల జోలికి పోవద్దని, ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నదంటే జాతకుడు ఖర్చులను నియంత్రించుకోవాలని అర్ధమన్నారు. రాష్ట్ర అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి కె.వి.ఆర్‌.ఎస్‌.ఎన్‌.ఆచార్యులు మాట్లాడుతూ తనను నిరంతరం ఆశ్రయించుకుని ఉండే భక్తుని యోగక్షేమాలు తానే చూసుకుంటానని గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడని అన్నారు. రాష్ట్రబ్రాహ్మణ సమాఖ్య ఈసీ మెంబర్‌ భమిడిపల్లి వెంకట రమణమూర్తికి పౌరోహిత్యంలో, డాక్టర్‌ ముళ్లపూడి రాజేంద్రప్రసాద్‌కు వైద్యరంగంలో, కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణకు సాహితీరంగంలో, కేశవభట్ల ఛారిటబుల్‌ ట్రస్టు చైర్మన్, సేవారంగంలో జాతీయస్థాయి అవార్డు గ్రహీత కేశవభట్ల శ్రీనివాసరావుకు సేవారంగంలో ఉగాది పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కోస్టల్‌ బ్యాంక్‌ హెడ్‌ నాగేశ్వరరావు, కూచిమంచి అనంతపద్మనాభశర్మ, కల్లూరి సూర్యనారాయణ శర్మ, చవ్వాకుల శ్రీనివాసరావు, పీఠం భక్తులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement