Sakshi News home page

పోరాడమంటే అరిటాకు అంటాడేంటి?

Published Wed, Aug 3 2016 2:20 PM

పోరాడమంటే అరిటాకు అంటాడేంటి? - Sakshi

ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటినుంచో ఉన్న హక్కని.. దాన్ని సాధించడానికి పోరాడమంటే సీఎం చంద్రబాబు అరిటాకు ముల్లు సామెతను చెబుతారేంటని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. బుధవారం ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటుంటే తనమీద తనకే జాలి వేసిందని.. మూడు రోజుల క్రితం రక్తం మరిగిపోయిందని అన్నవాళ్లు ఈరోజు అరిటాకు - ముల్లు సామెతలోకి వచ్చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలు అనుకుంటున్నట్లుగా కేసుల గురించి ఏమైనా భయపడుతున్నారా.. నిజంగానే కేసులున్నా కూడా మీరు తిరగబడితే అరెస్టు చేసే దమ్ము ఎవరికైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇలా ఉంటే మాత్రం తప్పనిసరిగా చర్య తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అసలు తిరగబడాలన్న ఆలోచన ఎందుకు రాదని ప్రశ్నించారు. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే సుజనా చౌదరి ఎందుకు సభలోకి వచ్చి కూర్చున్నారని నిలదీశారు. ఎటూ మూడేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి ఏం చేసినా పర్వాలేదని అనుకుంటున్నారా అని అడిగారు. ఉద్రేకం మొత్తం మూడు రోజుల్లో జారిపోయిందని, ఏం జరిగినా తనకే పోతుందని డైరెక్టుగా చెప్పేస్తున్నారని అన్నారు.  ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉందేమోగానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని ఉండవల్లి స్పష్టం చేశారు.  మనకు రావల్సిన హక్కు సాధించాలంటే కచ్చితంగా అడగాల్సింది పోయి.. అరిటాకులా చిరిగిపోతుందని అనడం ఏంటని.. అలాంటప్పుడు రాజ్యాంగం, పార్లమెంటు ఎందుకు, ఈ హామీలు.. పాలన ఎందుకని మండిపడ్డారు. ఇప్పటికే ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతుంటే అడగడానికి కూడా మొహమాటమా అంటూ కడిగేశారు.

ఇక పట్టిసీమ నుంచి ఎన్ని నీళ్లు కృష్ణాకు ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రిని రామచంద్రరావు అడిగితే.. అసలు వెళ్లిన నీటిని లెక్కించడానికి మీటర్లు ఏమీ పెట్టలేదని సమాధానం వచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, 2014-15లో అసలు ఏమీ నీళ్లు వెళ్లలేదని, 2015-16లో వెళ్లింది 4.21 టీఎంసీల నీళ్లేనని సమాధానం వచ్చిందన్నారు. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్లింది మొత్తం 8 టీఎంసీల నీళ్లని.. మిగిలినవి కాల్వల గండిలో పోయాయని తెలిపారు. జలయజ్ఞం చేసి దేశాన్ని దోచేశారని రాజశేఖరరెడ్డి మీద అనేక ఆరోపణలు చేశారు గానీ.. ఆయన కట్టిన పోలవరం కాలవకు ఒక్క చిన్న చిల్లు కూడా పడలేదని, చంద్రబాబు బ్రహ్మాండంగా కట్టిన కాలవకు ఇప్పటికే ఏడాది సమయంలో రెండు గండ్లు పడ్డాయని తెలిపారు. పైగా ఇందులో ఏదో కుట్ర జరిగిపోయిందని అంటున్నారు గానీ.. నిజానికి నిర్మాణం చేతకాక వాటి గతి ఇలా ఉందని ఆయన అన్నారు. 17,500 క్యూసెక్కుల ప్రవాహానికి సరిపోయేలా నాడు రాజశేఖరరెడ్డి కాలవలను నిర్మించారని, కానీ ఇప్పుడు 3,500 క్యూసెక్కుల నీళ్లు వెళ్లేసరికి మీరు కట్టిన కాలవలు కుప్పకూలిపోయాయని, దాన్ని బట్టే కాల్వల తవ్వకంలో ఎంత అవినీతి జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు.

Advertisement

What’s your opinion

Advertisement