లోపపోషణ పిల్లలకు పౌష్టికాహారం | Sakshi
Sakshi News home page

లోపపోషణ పిల్లలకు పౌష్టికాహారం

Published Mon, Jan 2 2017 1:14 AM

లోపపోషణ పిల్లలకు పౌష్టికాహారం

నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌
అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ


ఇందూరు : లోపపోషణకు గురైన పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్య వంతులుగా చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు లోప పోషణకు గురైన 0–6 లోపు పిల్లలను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని  చేపట్టేందుకు జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల నుంచి ఒక్కో సూపర్‌వైజర్‌కు రాష్ట్ర ఐసీడీఎస్‌ డైరెక్టరేట్‌ అధికారులు డిసెంబర్‌ 23 న శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న సూపర్‌వైజర్‌లు జిల్లాలోని మిగతా సూపర్‌వైజర్‌లకు శిక్షణ ఇచ్చారు. లోప పోషణ పిల్లలను గుర్తించడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎత్తు కొలతలు కొలిచే చార్టులు, బరువు కొలిచే మెషిన్‌లు అందుబాటులో ఉంచుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులు సెక్టార్‌ సూపర్‌ వైజర్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు.  లోప పోషణ పిల్లలను గుర్తించి వారి వివరాలను ఎప్పటికప్పుడు డైరెక్టరేట్‌కు అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1500 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, ఆరేళ్లలోపు పిల్లలు 79, 275 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారు కాకుండా ప్రయివేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలను కూడా బరువు చూడాలని ఆదేశాలున్నాయి.

లోప పోషణకు  కారణాలు.
జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన ప్రతి పిల్లవాడికి గుడ్డు, పాలు, భోజనం అందించాలి. అయితే కొన్ని కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడం, అందినా ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడంతో వారు లోప పోషణతో బాధపడుతున్నారు. పుట్టినప్పుడే తక్కువ బరువుతో పుట్టడం వల్ల కూడా శరీరం ఎదుగుదల ఉండదు. అలాంటి వారిని ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం ద్వారా గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ఇంటింటికీ తిరిగి బయట పిల్లల్ని కూడా అంగన్‌వాడీ కార్యకర్తలు బరువు తీస్తారు. అతి తక్కువ, తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించిన వెంటనే మెడికల్‌ ఆఫీసర్‌ వద్దకు పంపించి వైద్య పరీక్షలు చేయిస్తారు. వైద్య పరీక్షల అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పర్యవేక్షణతో కూడిన పౌష్టికాహారం ఫీడింగ్‌ ఇస్తారు. రెగ్యులర్‌ ఇచ్చే పౌష్టికాహారంతో, అదనంగా పౌష్టికాహారం ఇస్తూ వారానికి ఒక సారి బరువు తీసి ఎంత బరువు పెరిగారో రికార్డులో నమోదు చేస్తారు. ఒక వేళ పెరుగుదల లేకపోతే మెడికల్‌ ఆఫీసర్‌ పరీక్షించిన తరువాత అక్షయ కేంద్రానికి రిఫర్‌ చేస్తారు. వీరికి ప్రత్యేకంగా ఆరు నెలల వరకు ఫీడింగ్‌ ఇస్తారు.

Advertisement
Advertisement